రైతులకు మంత్రి నిరంజన్‌‌ రెడ్డి లేఖ

రైతులకు మంత్రి నిరంజన్‌‌ రెడ్డి లేఖ

హైదరాబాద్‌‌, వెలుగు: కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న రైతు, వ్యవసాయ వ్యతిరేక విధానాలతో నష్టపోకుండా రైతులు ఈ యాసంగిలో వరికి బదులుగా వేరే పంటలు వేయాలని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌‌రెడ్డి కోరారు. ఈ మేరకు గురువారం రైతులకు బహిరంగ లేఖ రాశారు. ఉమ్మడి రాష్ట్రంలో ఆత్మవిశ్వాసం కోల్పోయిన రైతాంగానికి సాగు నీరు అందించడం ఒక్కటే మార్గం కాదన్న ఉద్దేశంతో ఉచిత కరెంట్‌‌, రైతు బంధు, రైతు బీమా పథకాలతో పాటు విత్తనాలు, ఎరువులు అందుబాటులో ఉంచామని తెలిపారు. సీఎం కేసీఆర్‌‌‌‌ వ్యవసాయ అనుకూల విధానాలతో ఆకలి చావుల తెలంగాణ.. అన్నపూర్ణగా మారిందన్నారు. కేంద్ర ప్రభుత్వ మోసపూరిత విధానాలు పసిగట్టిన రాష్ట్ర ప్రభుత్వం కొంతకాలంగా ఆరు తడి పంటల వేయాలని రైతులను అప్రమత్తం చేస్తున్నదని తెలిపారు. కేంద్రం కార్పొరేట్లకు ఇస్తున్న సహకారం రైతాంగానికి ఇవ్వడం లేదన్నారు. దశాబ్దాలుగా కేంద్రం అధిక మద్దతు ధర ఇచ్చి దొడ్డు వడ్ల సాగును ప్రోత్సహించి బాయిల్డ్‌‌ రైస్‌‌ను సేకరించిందని, ఇప్పుడు హఠాత్తుగా నిల్వలు పేరుకుపోయాయని చెప్పి, బాయిల్డ్ రైస్ సేకరించలేమని చెబుతోందని మండిపడ్డారు. వడ్ల కొనుగోలు విషయంలో కేంద్రం డబుల్‌‌ గేమ్‌‌ ఆడుతోందని ఆరోపించారు.