ఆడపిల్లలను తక్కువ చూడొద్దు

ఆడపిల్లలను తక్కువ చూడొద్దు

వనపర్తి, వెలుగు: ఆడపిల్లలపై వివక్ష చూపొద్దని, వారి ఎదుగుదలకు తోడ్పాటు అందించాలని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి సూచించారు. మంగళవారం వనపర్తి జిల్లా కేంద్రంలోని మంత్రి క్యాంప్ కార్యాలయంలో సింగిరెడ్డి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో 100 మంది నిరుపేద ఎస్సీ, ఎస్టీ బాలికలకు ఉచితంగా సైకిళ్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఆడపిల్లలను మగవారితో సమానంగా చూడాలన్నారు. అమ్మాయిలకు చదువును మించిన ఆస్తిలేదని, ప్రతి పేరెంట్ బాగా చదివించాలని చెప్పారు. గురుకులాలు పెంచడంతో విద్యావ్యవస్థ స్వరూపమే మారిందన్నారు. సన్నబియ్యం అన్నంతో పౌష్టికాహారం, నాణ్యమైన చదువు చెప్పిస్తుండడంతో స్టూడెంట్ల సంఖ్య రెట్టింపు అయ్యిందన్నారు.
సురవరం కృషి మరువలేనిది
సురవరం ప్రతాపరెడ్డి తెలంగాణ భాషకు గొప్ప కీర్తిని తెచ్చారని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. మంగళవారం వనపర్తి ఎమ్మెల్యేక్యాం ప్ కార్యాలయంలో ఏర్పాటు చేయనున్న సురవరం ప్రతాపరెడ్డి కాంస్య విగ్రహానికి భూమి పూజ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ వనపర్తి ఎమ్మెల్యేగా13 నెలలే ఉన్నా సాహితీ, సాంస్కృతిక, సాంఘిక ఉద్యమాల ద్వారా ఆయన చేసిన కృషి ఎనలేనిదన్నారు. సెప్టెంబరు 9న విగ్రహాన్నిఆవిష్కరిస్తామని, సురవరం పేరు మీద ఒక పార్కు నిర్మించాలని నిర్ణయించామన్నారు. అలాగే ఆయన జీవితంపై 400 పేజీలతో రెండు సంపుటాలుగా పుస్తకం తీసుకురాబోతున్నామని చెప్పారు. అనంతరం వనపర్తి ఫోటోగ్రఫీ సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహించిన జాతీయ స్థాయి ఫోటోగ్రఫీ పోటీలకు సంబంధించిన వాల్ పోస్టర్ ను విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో అలంపూర్ ఎమ్మెల్యే అబ్రహం, జడ్పీచైర్మన్ లోక్ నాథ్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ గట్టుయాదవ్ , నాయకులు రమేశ్ గౌడ్, ఆవుల రమేశ్, లక్ష్మారెడ్డి, మహేశ్వర్ రెడ్డి
పాల్గొన్నారు.