స్వామినాథన్ విధానాలే అమలు చేస్తున్నం: నిరంజన్ రెడ్డి

స్వామినాథన్ విధానాలే అమలు చేస్తున్నం: నిరంజన్ రెడ్డి


హైదరాబాద్‌, వెలుగు: హరిత విప్లవ పితామహుడు ఎంఎస్. స్వామినాథన్ చెప్పిన విధానాలనే తెలంగాణ సాగు రంగంలో అమలు చేస్తున్నామని మంత్రి నిరంజన్‌రెడ్డి అన్నారు. బుధవారం తమిళనాడులోని చెన్నైలో స్వామినాథన్​ను మంత్రి నిరంజన్ రెడ్డి బ‌ృందం కలిసింది. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణలో వ్యవసాయం పండగలా మారిందని స్వామినాథన్​కు చెప్పామన్నారు. రైతుబంధు, రైతుబీమా, 24 గంటల ఫ్రీ కరెంట్, సాగునీరు, ప్రత్యామ్నాయ పంటల సాగు ఆవశ్యకత  గురించి వివరించామన్నారు.

ఐక్యరాజ్యసమితి ఫుడ్  అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ మానవాళిని ప్రభావితం చేసే 20 పథకాల్లో వీటికి చోటు దక్కిందని స్వామినాథన్‌ దృష్టికి తీసుకెళ్లినట్లు మంత్రి వెల్లడించారు. 2014లో  నరేంద్ర మోదీ ప్రధాని అయ్యాక స్వామినాథన్ కమిటీపై మరో కమిటీ వేసి అవమానించారని మంత్రి నిరంజన్ రెడ్డి విమర్శించారు. స్వామినాథన్ సిఫార్సులను పక్కన పెట్టారని చెప్పారు. అయినా ఇప్పటికీ ఆయన చేసిన సిఫార్సులే అమలు చేస్తున్నట్లు దేశాన్ని తప్పుదోవ పట్టిస్తున్నారని ఫైర్ అయ్యారు. 2022లోగా రైతుల ఆదాయం రెట్టింపు చేస్తామని ఇచ్చిన హామీని మోదీ సర్కార్ ఇప్పటికీ నెరవేర్చలేదని మంత్రి ఆరోపించారు.  స్వామినాథన్ ను కలిసిన వారిలో వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునందన్ రావు, విత్తనాభివృద్ధి సంస్థ ఎండీ కేశవులు, డిజిటల్ మీడియా డైరెక్టర్ దిలీప్ కొణతం  తదితరులు ఉన్నారు.