
హైదరాబాద్: మేనిఫెస్టోలో చెప్పినవన్నీ చేస్తామన్నారు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. రేపు అసెంబ్లీలో జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తామన్నారు. ప్రతి పేదవాడికి రేషన్ కార్టు అందేలా ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. రేషన్ కార్టులు, ఆరోగ్యశ్రీ కార్డులు విడివిడిగా ఇస్తామన్నారు. రేషన్ కార్డుల జారీపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి నేతృత్వంలో సబ్ కమిటీ వేయనున్నట్లు చెప్పారు. రేషన్ కార్డుల జారీపై విధివిధానాలు సబ్ కమిటీ నిర్ణయిస్తుందన్నారు. అర్హులైన ప్రతి పేదవాడికీ తెల్ల రేషన్ కార్డు, ఆరోగ్యశ్రీ కార్డు ఇస్తామన్నారు.
క్రీడాకారులు కాంగ్రెస్ ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. గత ప్రభుత్వం నామమాత్రంగానే ప్రోత్సహించిందన్నారు మంత్రి పొంగులేటి. బాక్సర్ నిఖత్ జరీన్, సిరాజ్ , ఈషాసింగ్ కు హైదరాబాద్ లో 600 గజాల ఇంటి స్థలాన్ని ఇస్తామన్నారు. నిఖత్ జరీన్, సిరాజ్ లకు గ్రూప్ 1 ఉద్యోగాలివ్వాలని కేబినెట్ నిర్ణయించినట్లు తెలిపారు.
గౌరవెళ్లి ప్రాజెక్టు పూర్తి చేయాలని కేబినెట్ లో నిర్ణయించామని మంత్రి పొంగులేటి అన్నారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే 2లక్షల ఎకరాలు సాగులోకి వస్తాయన్నారు. మరోసారి కోదండరామ్ , అమీర్ అలీఖాన్ పేర్లు ఎమ్మెల్సీ లుగా సిఫారసు చేస్తున్నట్లు మంత్రి పొంగులేటి అన్నారు. దీంతో పాటు నిజాం షుగర్ ఫ్యాక్టరీని త్వరలో రీ ఓపెన్ చేస్తామని పొంగులేటి అన్నారు.
నిజాం షుగర్ ఫ్యాక్టరీని రీఓపెన్ కు కేబినెట్లో నిర్ణయించిందన్నారు. మూసీ ప్రక్షాళన చేయాలని ఇందుకోసం నిధులు కేటాయించిందన్నారు. హైదరాబాద్ నగరానికి మల్లన్న సాగర్ నీటిని తరిలించేందుకు ప్రభుత్వం ప్రణాళికలు చేస్తుందన్నారు.
మల్లన్న సాగర్ నుంచి హుస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ లకు తరలించనున్నారు. 15 టీఎంసీల నీటిలో 5 టీఎంసీలు హైదరాబాద్ తాగునీరు, 10 టీఎంసీలు, మూసీ, హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో చెరువులు నింపేందుకు కేబినెట్ నిర్ణయించిందన్నారు మంత్రి పొంగులేటి.