- మెగా జీహెచ్ఎంసీని మూడు కార్పొరేషన్లుగా ప్రకటించే అవకాశం
- 10 గంటలకు తిరిగి ప్రారంభం కానున్న అసెంబ్లీ
- ఉపాధి హామీ పథకంపై స్వల్పకాలిక చర్చ
హైదరాబాద్, వెలుగు: అసెంబ్లీ సమావేశాలు శుక్రవారం ఉదయం10 గంటలకు తిరిగి ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు అసెంబ్లీ కార్యదర్శి రెండ్ల తిరుపతి గురువారం ‘లిస్ట్ ఆఫ్ బిజినెస్’ ను విడుదల చేశారు. సమావేశాల్లో మొత్తం ఐదు కీలక బిల్లులను ప్రభుత్వం సభలో ప్రవేశపెట్టి ఆమోదం పొందనుండగా, గ్రామీణ ఉపాధి హామీ పథకంపై ప్రత్యేక చర్చ జరగనుంది. సభ ప్రారంభం కాగానే ప్రశ్నోత్తరాల సమయం కొనసాగుతుంది.
అనంతరం సభా నాయకుడు, సీఎం రేవంత్ రెడ్డి బిజినెస్ అడ్వైజరీ కమిటీ (బీఏసీ) సమావేశం నిర్ణయాల నివేదికను సభలో ఉంచనున్నారు. అలాగే రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్.. మోటార్ వెహికల్స్ టాక్సేషన్ చట్టానికి సంబంధించిన గెజిట్ నోటిఫికేషన్ల ప్రతులను సభ ముందు ఉంచుతారు.
చట్టసభల ముఖ్య అజెండాలో భాగంగా ప్రభుత్వం ఐదు బిల్లులను ప్రతిపాదించనుంది. ఇందులో అత్యధికంగా నాలుగు బిల్లులను సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా ప్రవేశపెట్టనున్నారు. అవి తెలంగాణ మున్సిపాలిటీల (నాలుగో సవరణ) బిల్లు-2025, జీహెచ్‌ఎంసీ (సవరణ) బిల్లు-2025, జీహెచ్‌ఎంసీ (రెండో సవరణ) బిల్లు-2025తో పాటు తెలంగాణ ప్రైవేట్ విశ్వవిద్యాలయాల సవరణ బిల్లు-2025 ఉన్నాయి. అలాగే రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్.. తెలంగాణ మోటార్ వెహికల్స్ టాక్సేషన్ (సవరణ) బిల్లు-2025ను సభలో ప్రవేశపెడతారు.
మంత్రులు ప్రవేశపెట్టే ఈ బిల్లులపై చర్చ జరిపి, ఆమోదం తెలిపేలా అజెండాను రూపొందించారు. ఇక మెగా జీహెచ్ఎంసీని మూడు కార్పొరేషన్లుగా మార్చే అంశాన్ని సీఎం ప్రకటించే అవకాశం ఉంది. ‘మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం’ పేరును కేంద్రం ఇటీవల పేరు మార్చడం, రాష్ట్రానికి వాటా పెంచడంపైనా డిస్కషన్ జరగనుంది.
