- న్యూ ఇయర్ వేళ పోలీసుల స్పెషల్ డ్రంక్ అండ్ డ్రైవ్
- సిటీ లిమిట్స్‌లో 1,198 కేసులు
- విచిత్ర ప్రవర్తనతో పోలీసులకు మందుబాబుల చుక్కలు
హైదరాబాద్ సిటీ, వెలుగు: న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా మూడు కమిషనరేట్ల పరిధిలో నిర్వహించిన డ్రంక్ అండ్ డ్రైవ్‌లో 2,731 మంది మద్యం తాగి వాహనం నడుపుతూ పట్టుబడ్డారు. హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో అత్యధికంగా 1,198 మంది దొరికారు. సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో 928 మంది, మల్కాజిగిరి కమిషనరేట్ పరిధిలో 605 మంది మద్యం తాగి వాహనలు నడుపుతూ పట్టుబడ్డారు. మద్యం మత్తులో డ్రైవింగ్ చేయడంపై ‘జీరో టాలరెన్స్’ విధానాన్ని కొనసాగిస్తామని పోలీసులు ప్రకటించినట్టుగానే, పక్కాగా డ్రైవ్ నిర్వహించారు.
17 మందికి 300 పాయింట్లు దాటింది
హైదరాబాద్ పరిధిలో డిసెంబర్ 31న సాయంత్రం 7 గంటల నుంచి జనవరి 1 తెల్లవారుజాము దాకా స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. 1,198 మంది మద్యం మత్తులో వాహనాలు నడిపిన వారిపై కేసులు నమోదు చేశారు. వీరిలో 1,042 మంది బైకర్లు, 51 మంది త్రీ వీలర్ డ్రైవర్లు, 105 మంది ఫోర్ వీలర్ డ్రైవర్లు ఉన్నారు. 30–-50 పాయింట్లు మధ్యలో 175 కేసులు నమోదు కాగా.. 51–-100 పాయింట్లు తాగిన వారు 468 మంది ఉన్నారు. మరో 293 మందికి 101-–150, 163 మందికి -151-–200, 51 మందికి 201–-250, 31 మందికి- 251–-300, 17 మందికి 300 ఆపై పాయింట్లు రికార్డు అయింది.
ఐదుగురికి 500 పాయింట్లపైనే..
సైబరాబాద్ పోలీసు కమిషనరేట్ పరిధిలో కమిషనర్ ఎం.రమేశ్ నేతృత్వంలో 55 బృందాలు డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేపట్టి 928 మందిని పట్టుకున్నాయి. వీరిలో 695 మంది టూ వీలర్లు నడిపినవారు, 31 మంది త్రీ వీలర్లు తోలినవారు, 199 మంది ఫోర్‌వీలర్, ముగ్గురు భారీ వాహన డ్రైవర్లు ఉన్నారు. వీరిలో 419 మంది100 పాయింట్లలోపు అల్కాహాల్ తీసుకోగా.. 35 మంది 300లోపు, ఐదుగురు 500లోపు ఆల్కాహాల్ సేవించారు. మియాపూర్, ఆర్సీ పురం, రాయదుర్గం, గచ్చిబౌలి, కూకట్పల్లి, మేడ్చల్, నార్సింగి, రాజేంద్రనగర్, కేపీహెచ్‌బీ ప్రాంతాల్లో ఎక్కువ కేసులు నమోదయ్యాయి. ఐటీ కారిడార్‌లో సొసైటీ ఫర్ సైబరాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ సహకారంతో ఉచిత షటిల్ బస్ సేవలు ఏర్పాటు చేయడంతో ట్రాఫిక్ రద్దీ తగ్గిందని పోలీసులు తెలిపారు. ‘జీరో టాలరెన్స్ విధానంతో డ్రంక్ అండ్ డ్రైవింగ్ చర్యలు ఏడాది పొడవునా కొనసాగుతాయి అని సీపీ తెలిపారు.
మల్కాజిగిరి కమిషనరేట్ 605 కేసులు
మల్కాజిగిరి కమిషనరేట్ పరిధిలో కమిషనర్ అవినాశ్ మొహంతి నేతృత్వంలో 36 ప్రత్యేక బృందాలు మద్యం తాగి డ్రైవింగ్ చేస్తున్న 605 మందిని పట్టుకున్నాయి. 230 మందికి 100 పాయింట్లు రాగా.. 8 మందికి 300 పైగా ఆల్కాహాల్ పాయింట్లు వచ్చాయి. ఎల్‌బీనగర్, వనస్థలిపురం, ఉప్పల్, కుషాయిగూడ ప్రాంతాల్లో ఎక్కువ కేసులు రిజిస్టరయ్యాయి. దొరికిన వారిపై కేసులు నమోదు చేసి, చార్జిషీట్లు దాఖలు చేసిన తర్వాత కోర్టులో హాజరుపరుస్తామని అధికారులు తెలిపారు. మోటారు వాహనాల చట్టం-1988లోని సెక్షన్ 19 ప్రకారం వారి డ్రైవింగ్ లైసెన్సులను స్వాధీనం చేసుకుని, సస్పెన్షన్ కోసం సంబంధిత ఆర్‌టీఏలకు పంపించనున్నారు.
ఊదు.. నేను ఊద..
హైదరాబాద్‌లో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో పలువురు మద్యం మత్తులో ట్రాఫిక్ పోలీసులకు ముప్పు తిప్పలు పెట్టారు. కొందరు గొడవపడటం, తమను వదిలేయాలని ఏడ్వడం, రోడ్డుపై హల్చల్ చేయడం వంటి ఘటనలు చోటుచేసుకున్నా యి. నాంపల్లిలో ఓ యువకుడు డ్రంక్ అండ్ డ్రైవ్ చెకింగ్‌లో పట్టుబడి పోలీసులకు చుక్కలు చూపించాడు. తండ్రి పేరు అడిగితే బైక్ సీటుపై గట్టిగా కొట్టి, తన తండ్రిపైకి వెళ్లిపోయాడని, తనను వదిలేయాలని, పై నుంచి తండ్రి చూస్తు న్నాడని మాట్లాడాడు. పోలీసులు ఎంత అడిగినా అర్థం కానట్టే ప్రయత్నించాడు. వనస్థలిపురం ప్రాంతంలో మద్యం మత్తులో ఓ వ్యక్తి పట్టుబడగా తనను కానిస్టేబుల్ కొట్టాడని రోడ్డుపై పడుకున్నా డు. బైక్ రేపు తెచ్చి ఇస్తామని చెప్పినా వినకుండా గొడవపెట్టాడు. కొందరైతే ‘సార్.. ఈరోజు 31 నైట్, అందరికీ పర్మిషన్ ఉంటుంది.. వదిలే యండి’’ అని బతిమిలాడారు. మరికొందరు ఓవర్ యాక్షన్ చేస్తూ బ్రీత్ అనలైజర్ లో ఉదడమే రానట్టు నటించారు.
