- క్వింటాళ్ల మాంసం లాగేసిండ్రు
- ఆదిలాబాద్జిల్లాలోనే 211 డ్రంకెన్ డ్రైవ్ కేసులు
ఆదిలాబాద్, వెలుగు: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కొత్త ఏడాది ఖర్చు కోట్లు దాటింది. వేడుకల కోసం విచ్చలవిడిగా ఖర్చు చేశారు. మద్యం ఏరులై పారగా.. చికెన్, మటన్‌ను క్వింటాళ్ల కొద్దీ కొనుగోలు చేశారు. పల్లె, పట్టణం అనే తేడా లేకుండా బుధవారం ఉదయం నుంచి రాత్రి వరకు మద్యం, మాంసం దుకాణాలతో పాటు బేకరీలు, హోటళ్లు సైతం కస్టమర్లతో నిండిపోయాయి.
జిల్లా కేంద్రాలు, ప్రధాన పట్టణాల్లో రోడ్లపై టెంట్లు వేసి కేక్, ఫాస్ట్ఫుడ్లు విక్రయించారు. రోడ్లలో ఏర్పాటు చేసిన స్టాళ్లలో బిర్యానీలను జనాలు ఎగబడి కొనుగోలు చేశారు. సాదారణ రోజుల్లో కేజీ కేక్ రూ.300 ఉంటే న్యూ ఇయర్ సందర్భంగా రూ.350 కు పైగా విక్రయించారు.
పోలీసుల విస్తృత తనిఖీలు
డిసెంబర్31ను దృష్టిలో పెట్టుకొని పోలీసులు చెక్ పోస్టులు పెట్టి ఎక్కడికక్కడ డ్రంకెన్ డ్రైవ్ తనిఖీలు చేశారు. ఎస్పీలు, పోలీస్అధికారులు స్వయంగా పట్టణాల్లో తిరుగుతూ న్యూ ఇయర్ వేడుకలు ప్రశాంతంగా జరిగేలా పర్యవేక్షించారు. ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా బుధవారం ఒక్క రోజే 211 డ్రంకెన్ డ్రైవ్ కేసులు నమోదయ్యాయి. ఆసిఫాబాద్ జిల్లాలో 56 కేసులు నమోదు చేశారు. రామగుండం కమిషనరేట్ పరిధిలో 242 డ్రంకెన్ డ్రైవ్ కేసులు బుక్ అయ్యాయి.
కిక్కే కిక్కు..
కొత్త సంవత్సంరంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా గత మూడు రోజుల ముందు నుంచే లిక్కర్ సేల్స్ భారీగా పెరిగాయి. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 192 మద్యం దుకాణాలు ఉన్నాయి. వీటితో పాటు బార్లు, గ్రామాల్లోని బెల్టు షాపుల్లో మద్యం విక్రయాల జోరు కొనసాగింది. బుధవారం ఒక్కరోజే మంచిర్యాల జిల్లాలో దాదాపు రూ.6 కోట్లు, ఆదిలాబాద్ లో రూ.2.90 కోట్లు, నిర్మల్‌లో దాదాపు రూ.3 కోట్లు, ఆసిఫాబాద్ జిల్లాలో రూ.1.32 కోట్లు మద్యం సేల్ జరిగింది.
మూడు రోజుల్లో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఏకంగా రూ.60.71 కోట్ల మద్యం తాగేశారు. గత సంవత్సర రికార్డులు బద్దలయ్యాయి. క్వింటాళ్ల కొద్దీ చికెన్, మటన్ లాగేశారు. రాత్రి 10 గంటల వరకు సైతం మాంసం విక్రయాలు కొనసాగాయి. షాపుల్లో గిరాకీలు రూ.కోట్లలో జరిగినట్లు వ్యాపారులు చెబుతున్నారు.
లిక్కర్ సేల్స్ రూ.26.38 కోట్లు హైక్
మంచిర్యాల, వెలుగు: మంచిర్యాల జిల్లాలో లిక్కర్ సేల్స్ గణనీయంగా పెరిగాయి. జిల్లావ్యాప్తంగా 73 వైన్స్, 18 బార్ల ద్వారా ఏడాది కాలంలో దాదాపు రూ.26.38 కోట్ల మద్యం అధికంగా అమ్ముడుపోయింది. 2024 జనవరి నుంచి డిసెంబర్ వరకు ఐఎంఎల్ కేస్లు 6,99,407 సేల్ కాగా, బీర్ కేస్లు 11,57,547 అమ్ముడయ్యాయి. మొత్తం రూ.713.71 కోట్ల మద్యం అమ్మకాలు జరిగాయి.
కాగా 2025 జనవరి నుంచి డిసెంబర్ వరకు ఐఎంఎల్ కేస్ లు 7,2,615, బీర్ కేస్లు 9,96,438, మొత్తం రూ.740.09 కోట్ల సేల్స్ నమోదయ్యాయి. గత డిసెంబర్ ఒకటిన కొత్త షాపులు ఓపెన్ అయ్యాయి, ఆ వెంటనే గ్రామపంచాయతీ ఎన్నికలు రావడంతో మద్యం అమ్మకాలు ఒక్కసారిగా పెరిగాయి. ఇక డిసెంబర్ 25 నుంచి 31 వరకు 24,491 ఐఎంఎల్ కేస్లు, 21,865 బీర్ కేస్లు, మొత్తం రూ.27.83 కోట్ల అమ్మకాలు జరిగాయి.
ఉమ్మడి జిల్లాలో మూడు రోజుల్లో జరిగిన మద్యం విక్రయాలు
ఆదిలాబాద్ రూ.9.90 కోట్లు
నిర్మల్ రూ.15.86 కోట్లు
ఆసిఫాబాద్ రూ. 7.11 కోట్లు
మంచిర్యాల రూ. 23.15 కోట్లు
మొత్తం రూ. 60.71 కోట్లు
