పదేండ్ల పాలనలో వందేండ్ల నష్టం.. కేసీఆర్, హరీశ్ వల్ల సాగు నీటిలో తెలంగాణకు తీరని అన్యాయం

పదేండ్ల పాలనలో  వందేండ్ల నష్టం..   కేసీఆర్, హరీశ్ వల్ల సాగు నీటిలో  తెలంగాణకు తీరని అన్యాయం
  • కృష్ణాలో 299 టీఎంసీలకే ఒప్పుకుని ఏపీకి శాశ్వత హక్కులు రాసిచ్చారు
  • మేం 555 టీఎంసీల కోసం కేంద్రంతో కొట్లాడుతున్నం
  • దమ్ముంటే కేసీఆర్​ అసెంబ్లీకి రావాలి.. లేదంటే రాజకీయంగా జలసమాధే: సీఎం రేవంత్​
  •     కృష్ణా నుంచి రోజుకు 13.37 టీఎంసీలు తరలించేలా ఏపీ ప్రాజెక్టులు కట్టుకుంది
  •     మనం మాత్రం రోజుకు 0.25 టీఎంసీలు కూడా తీసుకోలేకపోతున్నం 
  •     పాలమూరు ప్రాజెక్టును జూరాల నుంచి శ్రీశైలానికి మార్చడం వల్లే రూ.84 వేల కోట్లకు అంచనా వ్యయం 
  •     ప్రాజెక్టు సోర్స్‌ మార్పుకు నాడు కేబినెట్ ఆమోదం తీసుకోలేదు 
  •     ఈ విషయం బయటపడ్తుందనే కేసీఆర్ అసెంబ్లీకి రావట్లేదు 
  •     ఇరిగేషన్ ప్రాజెక్టుల్లో లోపాలపై విచారణ జరిపిస్తం 
  •     దొంగతనం బయటపడ్తుందనే ఆదిత్యనాథ్ దాస్‌పై హరీశ్​ ఆరోపణలు చేస్తున్నారని ఫైర్ 

హైదరాబాద్, వెలుగు:  బీఆర్ఎస్ పదేండ్ల పాలనలో సాగు నీళ్ల విషయంలో రాష్ట్రానికి తీరని అన్యాయం జరిగిందని సీఎం రేవంత్ రెడ్డి మండిపడ్డారు. ‘‘తెలంగాణ ఆవిర్భావానికి ప్రధాన కారణం నీళ్లే. కానీ గత పదేండ్లలో కేసీఆర్, హరీశ్​రావు చేసిన తప్పుల వల్ల కృష్ణా, గోదావరి జలాల్లో రాష్ట్రానికి తీవ్ర నష్టం జరిగింది.. వందేండ్లలోనూ సరిదిద్దలేనంత అన్యాయం జరిగింది” అని ఫైర్ అయ్యారు. గురువారం ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో కలిసి ప్రజాభవన్‌లో మీడియాతో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు. బీఆర్ఎస్ హయాంలో సాగు నీటి రంగానికి తీవ్ర నష్టం జరిగిందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్, హరీశ్​రావు చెప్పేవన్నీ అబద్ధాలేనని అన్నారు. ‘‘కేసీఆర్ కృష్ణా జలాల్లో రాష్ట్ర హక్కులను ఏపీకి తాకట్టు పెట్టారు. కేవలం 299 టీఎంసీలకే ఒప్పుకుని 2020లో సంతకం చేశారు. పాలమూరు–రంగారెడ్డిని తాగునీటి ప్రాజెక్టుగా మార్చి సుప్రీంకోర్టులో అఫిడవిట్ ఇచ్చింది నిజం కాదా? సాగు నీటికి ఒక్క చుక్క ఇవ్వలేమని రాతపూర్వకంగా ఎందుకు రాసిచ్చారు? ఈ ప్రాజెక్టు కోసం జూరాల వద్ద ఉన్న తలను వదిలేసి, శ్రీశైలం వద్ద ఉన్న తోకను ఎందుకు పట్టుకున్నారు? కమీషన్ల కోసమే పంపులు, లిఫ్టులు పెంచి రూ.27 వేల కోట్లు మట్టిలో కలిపారు. పాలమూరు ప్రాజెక్టును జూరాల నుంచి శ్రీశైలానికి మార్చడానికి ఆనాడు కేబినెట్ ఆమోదమే లేదు” అని మండిపడ్డారు. కృష్ణా జలాలపై చర్చించేందుకు దమ్ముంటే కేసీఆర్ అసెంబ్లీకి రావాలని సవాల్ విసిరారు. పదేండ్ల పాపాలను కడిగేసుకోవడానికి ఆయనకు ఇదే అవకాశమని, లేదంటే రాజకీయంగా జల సమాధి తప్పదని హెచ్చరించారు.

కమీషన్ల కోసం కేసీఆర్ పాలమూరు ప్రాజెక్టును ఫణంగా పెట్టారని సీఎం రేవంత్ రెడ్డి మండిపడ్డారు. ‘‘పాలమూరు–-రంగారెడ్డి ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతులు లేవని ఎన్జీటీ స్టే ఇస్తే.. ఆనాడు కేసీఆర్ ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్లి పచ్చి అబద్ధం చెప్పింది. ‘ఇది సాగునీటి ప్రాజెక్టు కాదు.. కేవలం తాగునీటి ప్రాజెక్టు మాత్రమే. 7.15 టీఎంసీలు మాత్రమే వాడుకుంటాం’ అని అఫిడవిట్ ఇచ్చింది.  దీంతో ‘కేవలం తాగునీటి కోసమే వాడుకోండి.. మట్టి పని చేయడానికి వీల్లేదు’ అని సుప్రీంకోర్టు 2023లో ఆదేశాలిచ్చింది. కేవలం కమీషన్ల కోసం రూ.27 వేల కోట్లు ఖర్చు పెట్టిన ప్రాజెక్టును కేసీఆర్ ఫణంగా పెట్టారు. ఈ రికార్డులన్నీ రేపు అసెంబ్లీలో బయటపెడతాం’’ తెలిపారు. ‘‘పాలమూరు ప్రాజెక్టును కాపాడడానికి మేం ప్రయత్నిస్తున్నాం. మైనర్ ఇరిగేషన్ కింద సేవ్ అయిన నీటిని క్లస్టర్ల వారీగా లెక్కగట్టి, ఆ 45 టీఎంసీలకు పాలమూరు ప్రాజెక్టు కింద అనుమతి ఇవ్వాలని కేంద్రం, సీడబ్ల్యూసీ చుట్టూ తిరుగుతున్నాం. అనుమతులు వస్తే కేంద్రం నుంచి 60% నిధులు వస్తాయి. లేదా తక్కువ వడ్డీకి (7.25%) రుణాలు వస్తాయి. కేసీఆర్ తెచ్చిన 11.5% వడ్డీ భారం తగ్గుతుంది. కానీ ఈ జల వివాదాలు ఎలా ఉన్నాయంటే.. చార్మినార్ దగ్గర ఆటో నడిపినట్టుంది. ఎటు నుంచి సైకిల్ వస్తుందో, ఎటు నుంచి తోపుడు బండి వస్తుందో తెలియదు.  ట్రిబ్యునల్ చైర్మన్ వయసు 85 ఏళ్లు దాటింది. ఇంకా ఎన్నాళ్లు సాగదీస్తారు.. ఏడాదిలోపు తీర్పు ఇవ్వాలని సుప్రీంకోర్టులో కోరాం. జల వివాదాల సమస్య చాలా క్లిష్టమైనది. ఇలాంటి చిక్కుముడులను గత ప్రభుత్వం కావాలనే సృష్టించింది” అని ఫైర్ అయ్యారు.   

మాట మార్చిన హరీశ్..  

ప్రాజెక్టుల్లో లోపాలపై విచారణ జరిపేందుకు తాము సిద్ధం కావడంతో హరీశ్ రావు మాట మార్చారని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ‘‘ఇరిగేషన్ ప్రాజెక్టుల లోపాలపై విచారణ జరుపుతామని, టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ (టీఓఆర్) సిద్ధం చేయాలని లా సెక్రటరీ, ఇరిగేషన్ సెక్రటరీలను నేను ఆదేశించాను. ఈ విచారణ వార్త పసిగట్టిన హరీశ్​రావు.. వెంటనే తన వాదన మార్చారు. నాలుగు రోజుల క్రితం వరకు కృష్ణా జలాల గురించి మాట్లాడిన ఆయన.. ఇప్పుడు ఎంక్వయిరీకి భయపడి బనకచర్ల, నల్లమలసాగర్ అంటూ గోదావరి అంశాలను తెరపైకి తెస్తున్నారు” అని పేర్కొన్నారు.  

కేసీఆర్ నిర్వాకం వల్లే మనకు 299 టీఎంసీలు.. 

బచావత్ ట్రిబ్యునల్ మొత్తం 2,130 టీఎంసీలలో ఉమ్మడి ఏపీకి 811 టీఎంసీల నికర జలాలు కేటాయించిందని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ‘‘కిరణ్ కుమార్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు.. ఏపీకి 512, తెలంగాణకు 299 టీఎంసీలుగా ఒక లెక్క తీశారు. తెలంగాణ వచ్చాక కేసీఆర్, హరీశ్​రావు తొలి ఏడాది ఇదే 34:66 (299:512) నిష్పత్తికి ఒప్పుకున్నారు. ఒక ఏడాది, రెండేళ్లు అంటూ పొడిగించుకుంటూ పోయి.. చివరకు 2020లో కేసీఆర్ అసహనంతో ‘నన్ను డిస్టర్బ్ చేయకండి.. ఫామ్‌‌‌‌హౌస్‌‌‌‌లో ఉంటా.. మళ్లీ మళ్లీ నా దగ్గరకు రాకండి. ఒక్కసారే సంతకం పెడుతున్నా’ అంటూ ట్రిబ్యునల్ తుది తీర్పు వచ్చే వరకు ఇదే నీటి పంపకాలు (299:512) కొనసాగేలా శాశ్వతంగా సంతకం పెట్టి వచ్చారు. దీనివల్ల 2004లో వేసిన బ్రజేష్ కుమార్ ట్రిబ్యునల్ తీర్పు వచ్చేదాకా (ఇప్పటికే 21 ఏళ్లు గడిచింది) మనం 299 టీఎంసీలతోనే సరిపెట్టుకోవాలి. కేసీఆర్ ఇచ్చిన ఈ అవకాశాన్ని వాడుకొని ఏపీ తన 512 టీఎంసీలను వాడుకోవడానికి ప్రాజెక్టులన్నీ పూర్తి చేసుకుంది” అని చెప్పారు. 

మా పోరాటంతో ఏపీలో అలజడి.. 

కృష్ణా జలాల్లో న్యాయమైన వాటా కోసం కొట్లాడుతున్నామని సీఎం రేవంత్ తెలిపారు. ‘‘మేం అధికారంలోకి వ చ్చాక కృష్ణా జలాల్లో మనకు రావాల్సిన వాటా కోసం పోరాడుతున్నాం. పరీవాహక ప్రాంతం ఆధారంగా నీటి పంపకాలు జరగాలని వాదిస్తున్నాం. తెలంగాణలో 71% పరీవాహక ప్రాంతం ఉంది కాబట్టి మాకు 811 టీఎంసీలలో 555 టీఎంసీలు ఇవ్వాలని, మిగిలిన 29 శాతమే ఏపీకి ఇవ్వాలని ట్రిబ్యునల్ ముందు గట్టిగా వాదనలు వినిపించాం. లేదా 1,005 టీఎంసీల లభ్యత ఉంటే.. అందులో మాకు 763 టీఎంసీలు ఇవ్వాలని కోరాం. మా వాదన దెబ్బకు ఏపీలో అలజడి మొదలైంది. ‘తెలంగాణ వాదన సమర్థవంతంగా ఉంది.. మనం సాధించిన నీళ్లు  పోయే ప్రమాదం ఉంది. మీరు వాళ్లను ఎదుర్కోలేకపోతున్నారు’ అని వైఎస్ జగన్ 2024 నవంబర్ 19న చంద్రబాబుకు లేఖ రాశారు. ఇది మా ప్రభుత్వం సాధించిన విజయం” అని పేర్కొన్నారు. 

కమీషన్ల కోసమే రీడిజైన్ కుట్రలు.. 

కమీషన్లు దండుకోవడానికే కేసీఆర్ ప్రాజెక్టులను రీడిజైన్ చేశారని సీఎం రేవంత్ రెడ్డి మండిపడ్డారు. ‘‘కేసీఆర్ ట్రేడ్ సీక్రెట్ ఒక్కటే.. పంపులు, లిఫ్టులు పెంచాలి.. కమీషన్లు దండుకోవాలి. ఆయనకు వేరే ఫార్ములా తెలియదు. కాళేశ్వరం ప్రాజెక్టును రూ.38,500 కోట్లతో తుమ్మిడిహెట్టి నుంచి కాకుండా మేడిగడ్డకు మార్చి రూ.1.50 లక్షల కోట్లకు వ్యయం పెంచారు. పీసీ ఘోష్ కమిషన్ కూడా ఇదే చెప్పింది. అలాగే పాలమూరు–-రంగారెడ్డిని రూ.32,500 కోట్లతో జూరాల నుంచి చేపట్టాల్సి ఉండగా.. శ్రీశైలానికి మార్చి అంచనా వ్యయం రూ.80 వేల కోట్లకు పైగా పెంచారు. ఇందులో 3 స్టేజీల లిఫ్టులను 5 స్టేజీలు చేశారు. 22 పంపులను 37 పంపులు చేశారు. కేవలం పంపుల కంపెనీలకు పేమెంట్లు చేసి కమీషన్లు దండుకోవడానికే ఈ మార్పులు చేశారు” అని ఫైర్ అయ్యారు. 

తలను వదిలి.. తోక పట్టుకున్నరు

 పాలమూరు ప్రాజెక్టు విషయంలో నాడు కేసీఆర్ సర్కార్ తలను వదిలి, తోకను పట్టుకున్నదని సీఎం రేవంత్ రెడ్డి విమర్శించారు. ‘‘నీళ్లు వచ్చే జూరాల పూర్తిగా తెలంగాణలో ఉంది. అది మన ప్రాజెక్టు. అక్కడ వరద రోజుల్లో (సుమారు 30 రోజులు) రోజుకు 2-3 టీఎంసీల చొప్పున 90 టీఎంసీలు ఈజీగా లిఫ్ట్ చేసే అవకాశం ఉండేది. కానీ కేసీఆర్ తల వదిలేసి తోక పట్టుకున్నట్టు.. ప్రాజెక్టును శ్రీశైలానికి మార్చారు. శ్రీశైలం దగ్గర ఏపీకి పోతిరెడ్డిపాడు, ముచ్చుమర్రి, మల్యాల ద్వారా రోజుకు 13.5 టీఎంసీలు ఎత్తిపోసుకునే కెపాసిటీ ఉంది. మనకు మాత్రం కల్వకుర్తి, ఎస్ఎల్బీసీ కలిపినా కనీసం 0.25 టీఎంసీలు తీసుకునే కెపాసిటీ కూడా లేదు. కనీసం దొంగతనం చేయడానికైనా మనకు శక్తి ఉండాలి కదా? జూరాల నుంచి మార్చడం వల్ల ఏపీ ఒక కేసు వేసింది. ‘సోర్స్ మారింది, అంచనాలు మారాయి కాబట్టి ఇది కొత్త ప్రాజెక్టు.. కట్టడానికి వీల్లేదు’ అని వాదించింది. దీనివల్ల మనం ఇబ్బందుల్లో పడ్డాం” అని తెలిపారు. కేసీఆర్‌‌‌‌‌‌‌‌కు చట్టబద్ధంగానే శిక్ష పడుతుందని అన్నారు. 

జానారెడ్డిని చూసి నేర్చుకోండి

కేసీఆర్ తన అనుభవాన్ని తెలంగాణ అభివృద్ధి కోసం వాడాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. ‘‘గతంలో జానారెడ్డి ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు.. 2015–16లో పాలమూరు–-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం, మైనర్ ఇరిగేషన్‌‌‌‌లో లోపాలను ఎత్తిచూపుతూ కేసీఆర్‌‌‌‌కు అనేక లేఖలు రాశారు. ఒక ప్రతిపక్ష నేతగా ఆయన తన బాధ్యతను గుర్తుచేశారు. ఇప్పుడు కేసీఆర్  కూడా అసెంబ్లీకి రావాలి. కేసీఆర్.. మీ అనుభవం ఏంటో సభలో చెప్పండి. సభకు రావడం నామోషీగా ఉంటే కనీసం లేఖలైనా రాయండి. సభలో మీ హోదాకు, వయసుకి పూర్తి గౌరవం ఇస్తాం’’ అని పేర్కొన్నారు.

కేసీఆర్‌‌‌‌‌‌‌‌ను సభకు ఆహ్వానించండి.. 

2004–-14 మధ్య తెలంగాణ ఉద్యమంలో పని చేసిన సీనియర్ నేతలు కేశవరావు, సుఖేందర్ రెడ్డి, జితేందర్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, వివేక్ వెంకటస్వామి తదితరులందరూ కలిసి ఒక ప్రెస్‌‌‌‌మీట్ పెట్టి కేసీఆర్‌‌‌‌ను అసెంబ్లీకి ఆహ్వానించాలని సీఎం రేవంత్ రెడ్డి కోరారు. ‘‘సభలో ఒక మంచి సంప్రదాయాన్ని నెలకొల్పుదాం. తెలంగాణ నీటి హక్కుల కోసం అందరం కలిసి పోరాడుదాం. ఎమ్మెల్యేలందరూ సభకు 100 శాతం హాజరై, క్రమశిక్షణతో వాస్తవాలను ప్రజలకు వివరించాలి. నీటి కోసం జరిగిన కొట్లాటనే ప్రత్యేక రాష్ట్రానికి ప్రధాన కారణం. కృష్ణా, గోదావరి నదుల మధ్య ఉన్న మన రాష్ట్రం జీవన్మరణ సమస్య నీళ్లే. ఉమ్మడి రాష్ట్రంలో పీజేఆర్ వంటి నేతలు, జైపాల్ రెడ్డి, కేకే, వివేక్ వెంకటస్వామి, పొన్నం ప్రభాకర్ వంటి ఎంపీలు సొంత ప్రభుత్వాన్ని ఎదిరించి, పోతిరెడ్డిపాడుకు వ్యతిరేకంగా పోరాడారు. ఆనాడు వైఎస్సార్ జలయజ్ఞం చేపట్టినప్పుడు కూడా తెలంగాణకు నష్టం జరగకూడదని మనవాళ్లు వాదించారు. కానీ, తెలంగాణ వచ్చాక కేసీఆర్ ప్రభుత్వం వ్యూహాత్మక తప్పిదాలు చేసింది. మా ప్రభుత్వం ఇప్పుడు ఆర్భాటాల కోసం కాకుండా హక్కుల సాధన కోసం ఒక స్ట్రాటజీతో ముందుకువెళ్తోంది” అని స్పష్టం చేశారు.

బీఆర్ఎస్ మనుగడ కోసమే నీళ్ల సెంటిమెంట్​.. 

బీఆర్ఎస్‌ మనుగడ కోసమే కేసీఆర్ మళ్లీ నీళ్ల సెంటిమెంట్‌ను రెచ్చగొడుతున్నరు. అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలు మొదలు కంటోన్మెంట్, జూబ్లీహిల్స్ బైపోల్స్​, సర్పంచ్ ఎన్నికల వరకు అన్ని చోట్లా చిత్తుగా ఓడిపోవడంతో బీఆర్ఎస్ మనుగడ కష్టంగా మారింది. అందుకే కేసీఆర్ జల వివాదాన్ని రేపి, మా ప్రభుత్వం ఏపీకి సహకరిస్తున్నదనే అపోహ కల్పించడానికి అబద్ధాల సంఘాన్ని ఏర్పాటు చేసుకున్నారు. కేసీఆర్, హరీశ్ నోరు తెరిస్తే అబద్ధాలే. అవి తూకం వేస్తే 24 క్యారెట్ల అబద్ధాలు. అంత నాణ్యమైన అబద్ధాలు ఆడుతున్నారు.
- సీఎం రేవంత్​ రెడ్డి 

ఉత్తమ్ కృషి అమోఘం

మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి రాత్రింబవళ్లు కష్టపడుతున్నారని సీఎం రేవంత్ రెడ్డి కొనియాడారు. ‘‘చంద్రశేఖర్ రావు, హరీశ్​ రావు ఫైళ్లను ఏ రకంగా దాచారో, ఏ పేజీ వెనుక ఏ కోడ్ పెట్టారో అర్థం కావడం లేదు. పేపర్లను అడ్డంగా, తిప్పికొట్టి చదవాల్సి వస్తోంది. మంత్రి ఉత్తమ్ రోజుకు 18 గంటలు కష్టపడి.. కేసీఆర్ దాచిపెట్టిన, తారుమారు చేసిన పత్రాలన్నింటినీ స్టడీ చేస్తున్నారు. గత ప్రభుత్వం చేసిన వందేండ్ల నష్టాన్ని సరిదిద్దడానికి మేం ప్రయత్నిస్తున్నాం’’ అని పేర్కొన్నారు. 

ఆదిత్యనాథ్ దాస్ నియామకం సరైందే..

ప్రభుత్వ సలహాదారుగా ఆదిత్యనాథ్ దాస్ నియామకం సరైనదేనని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ‘‘ఆదిత్యనాథ్ దాస్ ఉమ్మడి రాష్ట్రంలో 2007–-14 వరకు తెలంగాణ ప్రాజెక్టులకు ఇరిగేషన్ సెక్రటరీగా పని చేశారు. ప్రాణహిత-–చేవెళ్ల నుంచి నారాయణపేట–కొడంగల్ లిఫ్ట్ వరకు, నెట్టెంపాడు, ఉదయసముద్రం.. ఇలా ప్రతి ప్రాజెక్టు జీవో ఆయన చేతుల మీదుగా వచ్చింది. ఆనాడు ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణకు పని చేశారు కాబట్టి.. ఆయనకు ప్రాజెక్టుల చరిత్ర, కేసీఆర్ చేసిన మార్పుల చిట్టా మొత్తం తెలుసు. కేసీఆర్ చేసిన దొంగతనాలు, పెంచిన అంచనాల లెక్కలు ఆదిత్యనాథ్ బయటపెడుతున్నారనే హరీశ్​ రావు ఆయనపై ఏడుస్తున్నారు. కేసీఆర్ హయాంలో ఏపీ క్యాడర్ అధికారులను (సోమేశ్ కుమార్, జోషి, స్మితా సబర్వాల్ తదితరులు) పెట్టుకోలేదా? వారిని ఎందుకు ప్రశ్నించలేదు? కేసీఆర్ దొంగతనాలు పట్టించేవాడు ఉండకూడదని హరీశ్​రావు మాట్లాడుతున్నారు” అని మండిపడ్డారు.