కాళేశ్వరం కోసం.. పాలమూరును పండబెట్టిన్రు!

కాళేశ్వరం కోసం.. పాలమూరును పండబెట్టిన్రు!
  • కరువు జిల్లాలకు నీళ్లిచ్చే ప్రాజెక్టుపై నాటి బీఆర్ఎస్ సర్కారు నిర్లక్ష్యం
  •     పాలమూరు ప్రాజెక్టు పనులు స్లో చేయాలంటూ నాటి సీఎం కేసీఆర్ ఓరల్ ఆర్డర్స్!
  •     అదే సమయంలో కాళేశ్వరం ప్రాజెక్టు కోసం వేగంగా నిర్ణయాలు.. నిధులు
  •     డీపీఆర్ తయారీ, పబ్లిక్ హియరింగ్, అనుమతులు సహా అన్నింటిలోనూ కాళేశ్వరానికే ప్రాధాన్యం

హైదరాబాద్, వెలుగు: కాళేశ్వరం ప్రాజెక్టు కోసం గత బీఆర్ఎస్ పాలకులు పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టును నిర్లక్ష్యం చేశారు. అనుమతులు, పనులు, నిర్మాణ ఖర్చు సహా ప్రతి విషయంలో అడుగడుగునా వెనకపడేశారు. తొలుత పాలమూరు ప్రాజెక్టుకు జీవో వచ్చినా.. కృష్ణా బేసిన్​లో స్టోరేజ్ పెంచుకునే అవకాశం మెండుగా ఉన్నా.. ఆ ప్రాజెక్టు పనులను కావాలని ఆలస్యం చేసిందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. పాలమూరు ప్రాజెక్టుకు పైసలు విడుదల చేయకుండా.. అదే సమయంలో అడిగిందే తడవుగా కాళేశ్వరం ప్రాజెక్టుకు మాత్రం నిధులను సమకూర్చిందన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. 

2014 నుంచి 2023 వరకు పదేండ్లలో ఆ రెండు ప్రాజెక్టుల పురోగతిని పరిశీలిస్తే ఇదే విషయం స్పష్టమవుతుందని ఇరిగేషన్ ఎక్స్​పర్ట్స్ చెబుతున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో కమీషన్ల కోసమే దానిపై దృష్టి సారించారని, అటు ఏపీకి కూడా ఆయాచిత లబ్ధి చేకూర్చేలా చేశారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఏపీకి లబ్ధి చేకూర్చేందుకే పాలమూరు పనులను స్లో చేయాలని నాటి సీఎం కేసీఆర్ నుంచి అధికారులకు ‘ఓరల్​ ఆర్డర్స్’ వచ్చాయన్న వాదనలూ వినిపిస్తున్నాయి.

ఇదీ తేడా..

పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టుకు 2023 వరకు బీఆర్ఎస్ ప్రభుత్వం రూ.27,513 కోట్లు ఖర్చు చేస్తే.. పాలమూరు ప్రాజెక్టు కన్నా వెనక ప్రారంభించిన కాళేశ్వరం కోసం మాత్రం రూ.89,794.71 కోట్లను నాటి బీఆర్​ఎస్​ ప్రభుత్వం ఖర్చు చేసింది. వాస్తవంగా పాలమూరు ప్రాజెక్టు డీపీఆర్​ తయారీకి 2014 ఆగస్టులోనే జీవో జారీకాగా.. కాళేశ్వరం ప్రాజెక్టుకు 2015 ఏప్రిల్ 13న జీవో ఇచ్చారు. 

మరోవైపు పాలమూరు ప్రాజెక్టుకు రూ35,200 కోట్లతో 2015 జూన్ 10న అడ్మినిస్ట్రేటివ్ అప్రూవల్ వస్తే.. మేడిగడ్డకు 2016 మార్చి 1న అనుమతులిచ్చారు. డీపీఆర్ జీవో జారీ నుంచి పాలమూరు ప్రాజెక్టు టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ జారీకి బీఆర్ఎస్ ప్రభుత్వం ఆలస్యం చేసింది. దాదాపు మూడేండ్ల తర్వాత 2017 అక్టోబర్ 10న పాలమూరుకు టీవోఆర్​ ఇస్తే.. మేడిగడ్డకు మాత్రం 2017 మార్చి 31న టీవోఆర్ జారీ చేయడం గమనార్హం. 

అంటే కేవలం రెండేండ్లలోనే మేడిగడ్డకు టీవోఆర్​లు వచ్చాయి. కాళేశ్వరం ప్రాజెక్టుకు పబ్లిక్​ హియరింగ్​పైనా వడివడిగానే బీఆర్ఎస్ పాలకులు ముందుకు వెళ్లారు. అడ్మినిస్ట్రేటివ్ అప్రూవల్ వచ్చిన ఏడాదిన్నరలోనే అంటే 2017 ఆగస్టు 22 నుంచి 26 వరకు పబ్లిక్ హియరింగ్ నిర్వహించారు. అదే పాలమూరు ప్రాజెక్టుకు ఆరేండ్లపాటు ఆలస్యం చేశారు. అడ్మినిస్ట్రేటివ్ అప్రూవల్ 2015లో వస్తే.. పబ్లిక్​హియరింగ్ 2021లో నిర్వహించడం పాలమూరు ప్రాజెక్టుపై బీఆర్ఎస్ సర్కారు నిర్లక్ష్యానికి అద్దం పడుతున్నది.

అనుమతులూ తేలే.. డీపీఆరూ​ లేటే..

కృష్ణా బేసిన్​లోని పాలమూరు, నల్గొండ, రంగారెడ్డి జిల్లాలకు అత్యంత కీలకమైన పాలమూరు ప్రాజెక్టుకు అనుమతులు, డీపీఆర్ విషయంలోనూ గత బీఆర్ఎస్ సర్కారు అదే నిర్లక్ష్యాన్ని ప్రదర్శించింది. 2017 డిసెంబర్ నాటికే కాళేశ్వరం ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతులు తీసుకొచ్చిన బీఆర్ఎస్ సర్కారు.. పాలమూరు ప్రాజెక్టుకు మాత్రం తీసుకురాలేకపోవడం గమనార్హం. కాళేశ్వరం ప్రాజెక్టు డీపీఆర్ సబ్​మిట్ చేయడంలోనూ గత బీఆర్ఎస్ ప్రభుత్వం మస్తు జోరు చూపించింది. 

2017 ఫిబ్రవరిలో డీపీఆర్​ను సీడబ్ల్యూసీకి సమర్పిస్తే.. పాలమూరు ప్రాజెక్టు డీపీఆర్​ను మాత్రం 2022 సెప్టెంబర్​లో సమర్పించడం గమనార్హం. కాళేశ్వరం ప్రాజెక్టుకు 2018 జూన్ నాటికి సీడబ్ల్యూసీ, టీఏసీ (టెక్నికల్ అడ్వైజరీ కమిటీ) క్లియరెన్సులు వస్తే.. ఇప్పటికీ పాలమూరుకు రాలేదు. ఇక, అంత ఖర్చు చేసినా.. అంత స్పీడ్​గా చర్యలు తీసుకున్నా కాళేశ్వరం ప్రాజెక్టు కింద కేవలం 98,570 ఎకరాల ఆయకట్టుకే నీళ్లిచ్చారు. పాలమూరు ప్రాజెక్టుకు ఒక్క ఎకరానికీ నీటి చుక్క రాలేదు. ఇవన్నీ పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టుపై గత బీఆర్ఎస్ ప్రభుత్వం చూపించిన నిర్లక్ష్యానికి నిదర్శనమని నిపుణులు చెబుతున్నారు.