కర్ణాటకలోని బళ్లారిలో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. మాజీ మంత్రి గాలి జనార్దన్ రెడ్డిపై కాల్పులు కలకలం రేపాయి. జనార్దన్ రెడ్డిపై స్థానిక ఎమ్మెల్యే భరత్ రెడ్డి సన్నిహితుడు కాల్పులు జరిపారు. మహర్షి వాల్మీకి విగ్రహం ఏర్పాటు సందర్భంగా ఫ్లెక్సీపై చెలరేగిన వివాదం ఇరువర్గాల మధ్య ఘర్షణకు దారి తీసింది. గన్ మెన్ తుపాకీ లాక్కున్న సతీష్ రెడ్డి 2 రౌండ్ల కాల్పులు జరిపినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో గాలి జనార్దన్ రెడ్డి అనుచరులు ఎదురు కాల్పులు జరపడంతో కాంగ్రెస్ కార్యకర్త రాజశేఖర్ మృతి చెందగా.. ఎమ్మెల్యే భరత్ రెడ్డి అనుచరుడు సతీష్ రెడ్డికి బుల్లెట్ గాయమైనట్లు సమాచారం.
మాజీ ఎమ్మెల్యే సూర్యనారాయణ రెడ్డితో గాలి జనార్దన్ రెడ్డికి ఉన్న రాజకీయ వైరం ఇప్పుడు ఆయన కొడుకు భరత్ రెడ్డితో కూడా కొనసాగుతోంది. సూర్యనారాయణ రెడ్డి ఫ్లెక్సీలు గాలి జనార్దన్ రెడ్డి ఇంటికి కట్టడంతోనే వివాదం మొదలైనట్లు తెలుస్తోంది. ఎమ్మెల్యే అతని అనుచరుల కుట్రల్ని సహించమని... అన్నిటికీ సమాధానం చెప్తామని అంటున్నారు గాలి జనార్దన్ రెడ్డి.
ప్రస్తుతం నెలకొన్న ఉద్రిక్తత కారణంగా బళ్లారిలో 144 సెక్షన్ విధించారు పోలీసులు. బళ్లారిలో ప్రధాన నాయకులు ఎవరు బయటికి రావద్దని ఆదేశాలు జారీ చేశారు పోలీసులు. మొత్తానికి ఫ్లెక్సీ విషయంలో చెలరేగిన వివాదం గాలి జనార్దన్ రెడ్డిపై కాల్పులు జరిపే వరకు రావడం తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది.
