
- జూన్‌లో రాజీవ్ యువ వికాసానికి శ్రీకారం
- రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి
వెంకటాపురం, వెలుగు : పేదలకు ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తోందని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి చెప్పారు. భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావుతో కలిసి బుధవారం ములుగు జిల్లా వెంకటాపురం, వాజేడు మండలాల్లో పర్యటింటి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ బీఆర్‌ఎస్ ప్రభుత్వం రూ.8.19 లక్షల కోట్ల అప్పు చేసి ప్రజలపై భారం మోపిందని విమర్శించారు.
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక.. గత పాలకులు చేసిన అప్పులను తీరుస్తూనే సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నామన్నారు. జూన్ 2 నుంచి రాజీవ్ యువ వికాసం స్కీమ్‌ను ప్రారంభించనున్నామని, ఇందుకోసం రూ.6 వేల కోట్లు విడుదల చేస్తున్నట్లు తెలిపారు. బీఆర్‌ఎస్ పాలనలో యువత నిరుద్యోగులుగా మారారని, ఇందిరమ్మ ప్రభుత్వం వచ్చాక 11 నెలల్లోనే 57,667 మందికి ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చామని గుర్తు చేశారు.
అంతకుముందు వాజేడు మండలం టేకులగూడెంలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి భూమిపూజ చేశారు. అనంతరం పాత్రపురం గ్రామంలో ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు మంజూరు పత్రాలు అందజేశారు. కార్యక్రమంలో ములుగు కలెక్టర్ దివాకర టీఎస్, ఐటీడీఏ పీవో చిత్రా మిశ్రా, మాజీ ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, డీఎఫ్‌వో రాహుల్ కిషన్ జాదవ్, ఆర్డీవో వెంకటేశ్ పాల్గొన్నారు.