- ఐ అండ్ పీఆర్ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి
- అక్రెడిటేషన్ జీవో సవరణపై మంత్రికి ధన్యవాదాలు తెలిపిన జర్నలిస్టు సంఘాలు
హైదరాబాద్, వెలుగు: జర్నలిస్టుల సంక్షేమం రాష్ట్ర ప్రభుత్వానికి ప్రాధాన్యమని ఐ అండ్ పీఆర్ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. వర్కింగ్ జర్నలిస్టుల సమస్యలన్నీ పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. అక్రెడిటేషన్ల విషయంలో గతంలో ఇచ్చిన హామీ మేరకు103 జీవోకు సవరణ చేయడంపై మంత్రికి టీడబ్ల్యూజేఎఫ్, డీజెఎఫ్ టీ, హెచ్ యూజే నాయకులు ధన్యవాదాలు తెలిపారు. ఈ మేరకు మంగళవారం సచివాలయంలో మంత్రిని కలిశారు.
వర్కింగ్ జర్నలిస్టులకు ప్రభుత్వ సహకారం ఇలాగే కొనసాగాలని, జిల్లాల్లో పనిచేస్తున్న డెస్క్ జర్నలిస్టులు అందరికి ఆయా ఎడిషన్ సెంటర్లలోనే అక్రెడిటేషన్ కార్డులు ఇచ్చేలా చూడాలని కోరారు. ఇతర పెండింగ్ సమస్యలు కూడా పరిష్కరించేలా చొరవ తీసుకోవాలన్నారు.
ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి స్పందిస్తూ ప్రజా ప్రభుత్వంలో అన్ని సమస్యలకు పరిష్కారం ఉంటుందని, ప్రభుత్వం చిత్తశుద్ధితో పని చేస్తుందని చెప్పారు. మంత్రిని కలిసిన వారిలో టీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు బి.రాజశేఖర్, కార్యదర్శి చంద్రశేఖర్, హెచ్ యూజే నాయకులు, డీజేఎఫ్ టీ ప్రెసిడెంట్ బాదిని ఉపేందర్, ప్రధాన కార్యదర్శి మస్తాన్, ఉపాధ్యక్షుడు కేఎన్ రాజారామ్, జాయింట్సెక్రటరీ విజయ, స్పోర్ట్స్ జర్నలిస్టు అసోయేషన్ రాష్ట్ర అధ్యక్షుడు కృష్ణారెడ్డి, ఇతర నాయకులు కె.రమేశ్, వెంకటరమణ, సత్య ప్రసాద్, గరిమా, నరేశ్ తదితరులు ఉన్నారు.
