- కూసుమంచి ప్రజాదర్బార్‌లో మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి
- పైరవీలకు తావులేకుండా అర్హులందరికీ ఇందిరమ్మ ఇండ్లు ఇస్తామని హామీ
కూసుమంచి, వెలుగు: ‘‘మాది రైతును రాజును చేసే ప్రభుత్వమైతే.. బీఆర్ఎస్ది రైతులకు సంకెళ్లేసి జైలుకు పంపిన సర్కారు” అని రాష్ట్ర రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి విమర్శించారు. ఆదివారం కూసుమంచి హైస్కూల్, తిరుమలాయపాలెం మండలం బచ్చోడు గ్రామాల్లో ప్రజాదర్బార్నిర్వహించారు. కలెక్టర్ దివాకర, అదనపు కలెక్టర్ శ్రీజతో కలిసి ప్రజల నుంచి మంత్రి అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఖమ్మం నడిరోడ్డు మీద చంటి పిల్లలతో ఉన్న రైతులకు సంకెళ్లు వేసి జైలుకు పంపించారని గుర్తుచేశారు.
ఈ ఘటనను జనం మర్చిపోలేదని, అందుకే బీఆర్ఎస్‌కు వరుసగా బుద్ధి చెబుతున్నారని విమర్శించారు. వరంగల్‌లో రాహుల్‌గాంధీ రైతు డిక్లరేషన్ ప్రకటించి గ్రౌండ్‌లోనే ఈ నెల 5, 6, 7 తేదీల్లో రైతులకు వ్యవసాయ పనిముట్లు పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. ఏ ఎన్నికలొచ్చినా జనం కాంగ్రెస్‌నే దీవిస్తున్నారని, ఇక బీఆర్ఎస్పార్టీ అధికారంలోకి వచ్చే చాన్సే లేదని తేల్చి చెప్పారు. ఎమ్మెల్యేగా కుల, మతాలకు, పార్టీలకు అతీతంగా సేవలందిస్తానని చెప్పారు.
‘‘ఒక్క రూపాయి లంచం లేకుండా పేదల ఖాతాల్లోకే ఇందిరమ్మ ఇండ్ల పైసలు జమ చేస్తున్నాం.. అర్హులైన ప్రతి పేదవాడికి ఇల్లు ఇచ్చే బాధ్యత నాది”అని మంత్రి భరోసా ఇచ్చారు. ప్రజాదర్బార్‌కు వస్తున్న ప్రతి అప్లికేషన్‌ను పరిష్కరిస్తామని, త్వరలోనే రెండో విడత ఇండ్లు కూడా మంజూరు చేస్తామని వెల్లడించారు.
