
- అభివృద్ధి, సంక్షేమాన్ని సమాంతరంగా కొనసాగిస్తున్నం
- మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి
నేలకొండపల్లి, వెలుగు : ప్రతి ఏడాది ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేస్తామని, ఇది నిరంతర ప్రక్రియ అని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి చెప్పారు. ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం సుర్దేపల్లి, అనంతనగర్, ఆరెగూడెం, మంగాపురం తండాల్లో చేపట్టిన పలు అభివృద్ధి పనులకు ఆదివారం గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వరరావు, కలెక్టర్ అనుదీప్ దురిశెట్టితో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ... సీఎం రేవంత్‌రెడ్డి నాయకత్వంలో అభివృద్ధి, సంక్షేమాన్ని సమాంతరంగా కొనసాగిస్తున్నామన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నామని చెప్పారు.
రైతుని రాజు చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందని చెప్పారు. అర్హులైన వారికి రేషన్ కార్డులు మంజూరు చేస్తున్నామని, ఈ కార్యక్రమాన్ని సీఎం రేవంత్‌రెడ్డి చేతుల మీదుగా నేడు ప్రారంభించనున్నట్లు ప్రకటించారు. కార్యక్రమంలో నేలకొండపల్లి మార్కెట్ కమిటీ చైర్మన్ వెన్నపూసల సీతారాములు, నాయకులు శాఖమూరి రమేశ్, కొడాలి గోవిందరావు, కుక్కల హనుమంతరావు, కడియాల శ్రీను, పీఆర్ ఎస్‌ఈ వెంకట్‌రెడ్డి, పాలేరు నియోజకవర్గ ప్రత్యేకాధికారి రమేశ్, నేలకొండపల్లి తహసీల్దార్ వెంకటేశ్వర్లు, ఎంపీడీవో ఎర్రయ్య పాల్గొన్నారు.
వ్యవసాయ కూలీలతో ముచ్చటించిన మంత్రి
నేలకొండపల్లి మండల పర్యటనకు వచ్చిన మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి మార్గమధ్యలో పొలంలో కూలీలతో ముచ్చటించారు. పెసర పంటను చూసి పంటల పెంపకం, సాగు పరిస్థితులు, నీటి సమస్యల గురించి అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. వరి నాటు వేసే కూలీలను కలిసి వారి జీవన స్థితిగతులపై చర్చించారు. మహిళా కూలీలు ఎదుర్కొంటున్న సమస్యలు, కూలి, ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాల గురించి మంత్రి అడిగి తెలుసుకున్నారు.