
- బిల్స్ స్టేటస్, ఇతర సమస్యల పరిష్కారం కోసమేనని వెల్లడి
హైదరాబాద్, వెలుగు: ఇందిరమ్మ ఇండ్ల పథకం లబ్ధిదారుల సౌకర్యార్థం తెలంగాణ హౌసింగ్ కార్పొరేషన్.. హిమాయత్ నగర్‌లోని హెడ్ ఆఫీసులో టోల్ ఫ్రీ నంబర్ 1800-599-5991తో కాల్ సెంటర్‌ను ఏర్పాటు చేసింది. ఈ కాల్ సెంటర్‌ను హౌసింగ్ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గురువారం ప్రారంభించారు. అనంతరం మంత్రి లబ్దిదారులతో ఫోన్‌లో మాట్లాడి, ఇండ్ల నిర్మాణ పురోగతి, బిల్లుల చెల్లింపు సమస్యలు, తదితర వివరాలు అడిగి తెలుసుకున్నారు.
తొలిరోజే దాదాపు 7,900 కాల్స్ రాగా..వీటిలో 345 కాల్స్‌ను టెలికాలర్స్ అటెండ్ చేసి సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. ఈ కాల్ సెంటర్ ప్రతి రోజూ ఉదయం 7 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు పనిచేస్తుంది. లబ్దిదారుల నుంచి ఫిర్యాదులు స్వీకరించడం, వాటిని సంబంధిత అధికారులకు తెలియజేసి పరిష్కరించనున్నారు. ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి మాట్లాడుతూ..‘‘లబ్ధిదారుల ఫోన్, ఆధార్ నంబర్ ఆధారంగా సమస్యలను పరిశీలించి వేగంగా పరిష్కరించేందుకు ఈ కాల్ సెంటర్ ఉపయోగపడుతుంది.
బిల్లుల చెల్లింపుల్లో జాప్యం, ఫొటోల అప్‌లోడ్‌లో ఆలస్యం, టెక్నికల్ సమస్యలు, అవినీతి ఆరోపణలు వంటి అంశాలపై ఫిర్యాదులను స్వీకరించి, సంబంధిత అధికారుల ద్వారా చర్యలు తీసుకుంటాం. ఇందిరమ్మ ఇండ్ల పథకంలో పారదర్శకత కోసం ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగిస్తున్నాం. ఇందిరమ్మ యాప్ ద్వారా ఇప్పటికే మంచి ఫలితాలు సాధించాం. అవినీతికి ఆస్కారం లేకుండా ఇండ్ల నిర్మాణం పూర్తయ్యేలా చర్యలు తీసుకుంటాం’’ అని మంత్రి హామీ ఇచ్చారు.