ఖమ్మం జిల్లాలో సీఎం పర్యటన ఏర్పాట్లు పక్కాగా ఉండాలి : మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి

 ఖమ్మం జిల్లాలో సీఎం పర్యటన ఏర్పాట్లు పక్కాగా ఉండాలి : మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి

ఖమ్మం రూరల్, వెలుగు : రేపు ఖమ్మం జిల్లాలో ముఖ్యమంత్రి పర్యటన ఖరారైందని, అవసరమైన ఏర్పాట్లన్నీ పక్కాగా చేపట్టాలని మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి అధికారులను ఆదేశించారు. శుక్రవారం మద్దులపల్లి నర్సింగ్ కళాశాల వద్ద జిల్లా ఇన్​చార్జి కలెక్టర్ డాక్టర్ పీ.శ్రీజ, ఖమ్మం పోలీస్ కమిషనర్ సునీల్ దత్, అడిషనల్​ కలెక్టర్ పీ.శ్రీనివాసరెడ్డితో కలిసి ఆయన సీఎం పర్యటన ఏర్పాట్లను పరిశీలించారు. 

అనంతరం సంబంధిత జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ జనవరి 18న ఉదయం 10.30 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి మద్దులపల్లిలో ల్యాండ్ అవుతారని తెలిపారు. హెలీ ప్యాడ్ నుంచి పైలాన్ వరకు కాలినడకన సీఎం వస్తారని, అక్కడ గ్రీన్ మ్యాట్ ఏర్పాటు చేయాలని సూచించారు.

 జేఎన్టీయూ కళాశాల భవన నిర్మాణానికి, మున్నేరు నుంచి పాలేరు లింక్ కెనాల్ కు శంకుస్థాపనలు, నూతన యార్డు, కూసుమంచి 100 పడకల ఏరియా ఆస్పత్రి ప్రారంభోత్సవ పైలాన్ ఆవిష్కరణ, ప్రభుత్వ నర్సింగ్ కళాశాల ప్రారంభోత్సవ కార్యక్రమం జరుగుతుందని వెల్లడించారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, ఉత్తమ్ కుమార్ రెడ్డి, దామోదర రాజనర్సింహ, వాకిటి శ్రీహరి తదితరులు పాల్గొంటారని చెప్పారు. 

ఇదే వేదికగా రాబోయే మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికల సన్నద్ధతపై ఉమ్మడి జిల్లా ముఖ్య కార్యకర్తలతో సీఎం దిశానిర్దేశం చేయనున్నారని తెలిపారు. రాష్ట్ర చరిత్రలో నిలిచిపోయేలా ఈ నెల 18న మేడారంలో రాష్ట్ర మంత్రివర్గ సమావేశం నిర్వహించనున్నట్లు ప్రకటించారు. సమ్మక్క-సారలమ్మ జాతరను కుంభమేళా కంటే అద్భుతంగా నిర్వహించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోందని మంత్రి తెలిపారు.

 మేడారంలో కాకతీయుల నాటి వైభవం ఉట్టిపడేలా నిర్మించిన రాతి కట్టడాలను 19న ఉదయం ముఖ్యమంత్రి ప్రారంభిస్తారని వెల్లడించారు. జిల్లా ఇన్​చార్జి కలెక్టర్ డాక్టర్ శ్రీజ మాట్లాడుతూ పైలాన్ శనివారం వరకు సిద్ధమవుతుందని తెలిపారు.  హెలీ ప్యాడ్ వద్ద వీవీఐపీలు, మంత్రుల, సీఎం కాన్వాయ్ వాహనాలు మాత్రమే అనుమతి ఉంటుందని చెప్పారు.  ఈ సమావేశంలో రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వర రావు, వివిధ శాఖల అధికారులు, తదితరులు పాల్గొన్నారు.