
- వచ్చే 5 ఏండ్లలో 20 లక్షల ఇండ్లు నిర్మిస్తున్నం: మంత్రి పొంగులేటి
- 95 శాతం రూరల్ నుంచి వచ్చిన యువ ఇంజనీర్లను సెలెక్ట్ చేసినం
- ఏఈల ఫిర్యాదులకుటోల్ ఫ్రీ నంబర్ ఏర్పాటు చేస్తం
- ప్రలోభాలకు గురికావొద్దు.. 600 ఎస్ఎఫ్టీ దాటితే బిల్లులు ఇవ్వం
- 350 మంది ఏఈలకుఅపాయింట్మెంట్ ఆర్డర్లు అందజేత
హైదరాబాద్, వెలుగు: ఇందిరమ్మ ఇండ్ల స్కీమ్ లో భాగంగా వచ్చే ఐదేండ్లలో ఏడాదికి 4. 5 లక్షల ఇండ్ల చొప్పున 20 లక్షల గృహాలు నిర్మిస్తున్నామని హౌసింగ్ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వెల్లడించారు. ఈ ఒక్క స్కీమ్ కే రూ. లక్ష కోట్లు ఖర్చు చేస్తున్నామని చెప్పారు. దేశంలోనే ఇంటి నిర్మాణానికి రూ. 5 లక్షల ఆర్థిక సహాయాన్ని వంద శాతం సబ్సిడీతో ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని తెలిపారు. శనివారం మాదాపూర్ లోని నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ ( న్యాక్ ) లో ఇందిరమ్మ స్కీమ్ కోసం ఔట్ సోర్సింగ్ పద్ధతిలో రిక్రూట్ చేసుకున్న 350 మంది ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు ( ఏఈ) లకు మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి అపాయింట్ మెంట్ ఆర్డర్లు అందజేశారు.
ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ.. ఎలాంటి ఒత్తిళ్లు, ప్రలోభాలు, సిఫార్సులు, పైరవీలకు తావు లేకుండా మెరిట్ ప్రాతిపదికన 95 శాతం రూరల్ బ్యాక్ గ్రౌండ్ కు చెందిన ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్లను ఏఈ పోస్టులకు ఎంపిక చేశామని తెలిపారు. ఇందులో 45 శాతం మంది మహిళలే ఉండటం చాలా సంతోషంగా ఉందన్నారు. ఇండ్ల పథకాల్లో కేంద్రం ఇస్తున్న నిధులతోనే అన్ని రాష్ట్రాలు సరిపెడుతున్నాని చెప్పారు. చత్తీస్‌గఢ్, ఏపీలో కేంద్ర వాటాతోనే ఇండ్లు నిర్మిస్తున్నారని, రాష్ట్ర వాటానే లేదని తెలిపారు.
చివరి దశకు రెండో విడత ఇండ్ల జాబితా
ఇందిరమ్మ ఇండ్ల రెండో దశలో భాగంగా ఈ నెల 10 వరకు లబ్ధిదారుల జాబితా ఫైనల్ చేస్తామని, ఇది చివరి దశకు చేరిందని మంత్రి పొంగులేటి వెల్లడించారు. విధుల్లో చేరిన వెంటనే అసిస్టెంట్ ఇంజినీర్లు ఈ జాబితాలపై దృష్టి సారించాలని సూచించారు. ఎలాంటి ప్రలోభాలు, ఒత్తిళ్లకు గురికాకుండా అర్హులకే ఇందిరమ్మ ఇండ్లు లభించేలా క్షేత్రస్థాయిలో పనిచేయాలని సూచించారు. ఏఈల ఫిర్యాదుల కోసం సెక్రటేరియెట్‌లోని తన చాంబర్ లో టోల్ ఫ్రీ నంబర్ ఏర్పాటు చేస్తామని, ఫిర్యాదు చేసినవారి వివరాలు గోప్యంగా ఉంచుతామని వెల్లడించారు. వివిధ దశల్లో నిర్మాణం పూర్తి చేసుకున్న లబ్ధిదారులకు ప్రతి సోమవారం చెల్లింపులు చేస్తున్నామని తెలిపారు.
400 నుంచి 600 ఎస్ ఎఫ్ టీ వరకు మాత్రమే ఇండ్లను నిర్మించాలని అన్నారు. అంతకంటే ఎక్కువ విస్తీర్ణంలో నిర్మిస్తే బిల్లులు ఆపేస్తామని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా అధికారుల సర్వేలో 285 మంది లబ్ధిదారులు 600 ఎస్ ఎఫ్ టీ కంటే ఎక్కువ విస్తీర్ణంలో ఇండ్లు నిర్మించారని, వీరికి మొదటి దశ బిల్ ఆపామని, తర్వాత బిల్ రిలీజ్ చేశామని వెల్లడించారు. కాగా, కొత్తగా ఎన్నికైన ఏఈలకు గత 6 రోజుల నుంచి ఇండ్ల స్కీమ్ పై హౌసింగ్ కార్పొరేషన్ అధికారులు ట్రైనింగ్ ఇవ్వగా.. శనివారంతో ముగిసింది. ఇప్పటికే వీరికి డ్యూటీ చేసే జిల్లాలను కేటాయించారు. ఆదివారం జిల్లా కలెక్టర్లు, హౌసింగ్ ప్రాజెక్టు డైరెక్టర్లు (పీడీ) లు మండలాల్లో పోస్టింగ్ ఇస్తారు. సోమవారం నుంచి వీరంతా విధుల్లో చేరనున్నారు. కాగా, ఈ కార్యక్రమంలో హౌసింగ్ సెక్రటరీ జ్యోతి బుద్ధ ప్రకాశ్, న్యాక్ డీజీ, ఆర్ అండ్ బీ స్పెషల్ సెక్రటరీ హరిచందన, న్యాక్ డైరెక్టర్ శాంతి శ్రీ , హౌసింగ్ సీఈ చైతన్య కుమార్, సీనియర్ కన్సల్టెంట్ ఈశ్వరయ్య పాల్గొన్నారు.
రిజిస్ట్రేషన్ శాఖలో 21 మందికి పదోన్నతి
స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖలో 21 మందికి ప్రభుత్వం పదోన్నతి కల్పించింది. గ్రేడ్ -–2లో పనిచేస్తున్న10 మంది సబ్ రిజిస్ట్రార్లను గ్రేడ్-–1కు, సీనియర్ సహాయకులుగా పనిచేస్తున్న 11 మందికి గ్రేడ్-–2 పదోన్నతి ఇచ్చింది. వీరికి స్టాంప్ అండ్ రిజిస్ట్రేషన్‌శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి పదోన్నతి సర్టిఫికెట్లను అందజేశారు.