బీఆర్ఎస్‎కు అధికారం ఇక కల.. ముందు మీ ఇంటి సమస్యలు చక్కబెట్టుకో: కేటీఆర్‎కు పొంగులేటి కౌంటర్

బీఆర్ఎస్‎కు అధికారం ఇక కల.. ముందు మీ ఇంటి సమస్యలు చక్కబెట్టుకో: కేటీఆర్‎కు పొంగులేటి కౌంటర్

హైదరాబాద్: మళ్లీ అధికారంలోకి వస్తానని కేటీఆర్ కలలు కంటున్నాడు.. కానీ బీఆర్ఎస్‎కు అధికారం ఇక కలేనని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. ఖమ్మం పర్యటనలో కేటీఆర్ చేసిన వ్యాఖ్యలకు పొంగులేటి కౌంటర్ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రభుత్వానికి రెఫరెండం అని ఓటమిపాలయ్యారు.. మళ్లీ ఇప్పుడు మున్సిపాలిటీ ఎన్నికలు సెమీ ఫైనల్ అంటున్నారని విమర్శించారు. 

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక, లోకల్ బాడీ ఎలక్షన్స్‎లో ఓటమి పాలైన బుద్ధి రాలేదని.. కేటీఆర్ ఇంకా సిగ్గు లేకుండా మాట్లాడుతున్నాడని దుయ్యబట్టారు. అధికారం తర్వాత.. ముందు మీ ఇంటి సమస్యలు చక్కబెట్టుకో అని కేటీఆర్‎కు చురకలంటించారు. దీపావళి బాంబులు ఏం ఏం పేలుతున్నాయో వాళ్లకు తెలుసని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వాళ్లు మాట్లాడే ప్రతిదానికి స్పందించాల్సిన అవసరం లేదన్నారు. 

ఈ నెల 18న మేడారానికి సీఎం రేవంత్: పొంగులేటి

ఈ నెల 18న సీఎం రేవంత్ రెడ్డి మేడారం పర్యటన ఖరారైందని తెలిపారు. కుటుంబ సమేతంగా మేడారం చేరుకొని అక్కడే రాత్రి బస చేస్తారని చెప్పారు. 19న సమ్మక్క సారక్క దేవతలకు సీఎం మొక్కలు చెల్లించుకుంటారు.. అనంతరం జాతర పనులు ప్రారంభిస్తారని తెలిపారు. వరంగల్ అభివృద్ధిపై కాంగ్రెస్ ప్రభుత్వం ధృడ సంకల్పంతో ఉందన్నారు.  సీఎం రేవంత్ రెడ్డి చిత్తశుద్ధితో  మమునూరు ఎయిర్ పోర్ట్ రాబోతుందని తెలిపారు. మమునూరు ఎయిర్ పోర్ట్ నిర్మాణానికి రైతులను ఒప్పించి భూ సేకరణ చేసిన అధికారులను ఈ సందర్భంగా ప్రశంసించారు.