- అభివృద్ధిలో అందరిని సమానంగా చూస్తున్నాం: మంత్రి పొంగులేటి
- మేడ్చల్ సెగ్మెంట్ పోచారంలో ఇందిరమ్మ టవర్లకు శంకుస్థాపన
హైదరాబాద్/ఘట్కేసర్, వెలుగు: రాష్ట్రంలోని ప్రజా ప్రభుత్వం అధికార, ప్రతిపక్ష పార్టీలు అనే తేడా లేకుండా రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గాన్ని సమానంగా చూస్తోందని హౌసింగ్ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. అర్హులైన పేదలకు ఇందిరమ్మ ఇండ్లు అందించడంలో ఎలాంటి వివక్షకు తావులేదని స్పష్టం చేశారు. బుధవారం మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా పోచారంలో ఇందిరమ్మ ఇండ్ల టవర్స్కు రంగారెడ్డి జిల్లా ఇన్చార్జి మంత్రి శ్రీధర్ బాబు, ఎంపీ ఈటల రాజేందర్, ఎమ్మెల్యే మల్లారెడ్డి, ఎమ్మెల్సీ మహేందర్రెడ్డితో కలిసి మంత్రి పొంగులేటి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఆ కుటుంబం ప్రాతినిధ్యం వహించిన నియోజకవర్గాలకే డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు పరిమితమయ్యాయని ఆరోపించారు. పేదలు నివసించే ప్రాంతాల్లోనే వారికి గౌరవప్రదమైన నివాసం కల్పించాలనే లక్ష్యంతో ఇందిరమ్మ టవర్స్ నిర్మాణానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని చెప్పారు.
“క్యూర్ పరిధిలో మొదటి విడతగా లక్ష ఇండ్ల నిర్మాణాన్ని లక్ష్యంగా పెట్టుకున్నాం. 23 నియోజకవర్గాల్లో పనులకు సంబంధించి టెండర్ల ప్రక్రియ పూర్తి చేశాం. రెండవ విడత ఇందిరమ్మ టవర్స్ కోసం మరోసారి దరఖాస్తులు తీసుకుంటాం”అని మంత్రి తెలిపారు. లబ్ధిదారులకు కేవలం కేటాయింపు పత్రాలు ఇచ్చి సరిపెట్టబోమని, ఎలాంటి రిజిస్ట్రేషన్ చార్జీలు లేకుండా పూర్తి హక్కులతో ఇండ్లను రిజిస్ట్రేషన్ చేసి అందిస్తామన్నారు. క్యూర్ పరిధిలో నిర్మాణంలో ఉన్న ఇందిరమ్మ టవర్ల నిర్మాణం వచ్చే బతుకమ్మ పండుగ నాటికి పూర్తి చేసి, లబ్ధిదారులకు అందించాలన్నదే తమ లక్ష్యమని మంత్రి పేర్కొన్నారు. గత ప్రభుత్వం అసంపూర్తిగా వదిలేసిన డబుల్ బెడ్రూమ్ ఇండ్లను కూడా పూర్తి చేసి లబ్ధిదారులకు అందిస్తామన్నారు.
వచ్చే దసరాకు ఇండ్లు పూర్తి: మంత్రి శ్రీధర్ బాబు
మొదటి దశలో కేటాయింపులు జరిగిన ఇందిరమ్మ టవర్లను ఏడాదిలోగా నిర్మాణం పూర్తి చేసి లబ్ధిదారులకు అందజేస్తామని జిల్లా ఇన్చార్జి మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. గత ప్రభుత్వ పాలనలో ఏండ్ల తరబడి నిర్మాణాలు కొనసాగేవని, అలాంటి పరిస్థితి ఇప్పుడు ఉండదన్నారు. ఇందిరమ్మ టవర్లకు రోడ్లు, మంచినీటి సదుపాయం, లిప్ట్ లాంటి మౌలిక సదుపాయాలను గడువులోగా పూర్తి చేస్తామని వెల్లడించారు. ఇండ్లు లేని పేదలకు వారి సొంత నియోజకవర్గం పరిధిలోనే ఇందిరమ్మ గృహాలను నిర్మించి ఇస్తున్నామని చెప్పారు. పోచారం ప్రాంతంలో సింగిల్ బెడ్ రూం కొనాలన్న రూ.40 లక్షలు ఖర్చవుతుందని, రూ.6 లక్షలు భరిస్తే అంతకంటే విలువైన ఇండ్లను నిర్మించి ఇస్తున్నామని మంత్రి తెలిపారు. ఈ కార్యక్రమంలో హౌసింగ్ శాఖ స్పెషల్ సెక్రటరీ వీపీ గౌతమ్, మేడ్చల్ కలెక్టర్ మనుచౌదరి పాల్గొన్నారు.
