మహిళలను కోటీశ్వరులుగా చేస్తాం : మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి

మహిళలను కోటీశ్వరులుగా చేస్తాం : మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి
  • ఇందిరమ్మ పాలనలో -పేదల ఆశలకు నిజమైన భరోసా
  • మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి 
  • మహిళా స్వయం శక్తి సంఘాలకు వడ్డీ లేని రుణాల చెక్కుల పంపిణీ

దమ్మపేట, వెలుగు : కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడమే ప్రభుత్వ లక్ష్యం అని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. బుధవారం దమ్మపేట గిరిజన  జూనియర్ కళాశాల మైదానంలో ఇందిరా మహిళా శక్తి సంబరాల కార్యక్రమంలో భాగంగా అశ్వారావుపేట ఎమ్మెల్యే జారే ఆదినారాయణ ఆధ్వర్యంలో అన్నపురెడ్డిపల్లి, అశ్వారావుపేట, దమ్మపేట, చండ్రుగొండ, ములకలపల్లి మండలాల మహిళా స్వయం శక్తి సంఘాలకు వ్యాసరచన, ముగ్గులు, ఆటల పోటీలు నిర్వహించారు. 

ముఖ్య అతిథిగా మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి హాజరై కార్యక్రమాన్ని ప్రారంభించారు. స్థానిక సంస్థల అడిషనల్​  కలెక్టర్ విద్యాచందన, మహిళా శిశు సంక్షేమ, వయోవృద్ధుల శాఖ అధికారి స్వర్ణలత మహిళల అభ్యున్నతికి ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలు,  ప్రోత్సాహకాల గురించి వివరించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో మహిళల సాధికారత కోసం  ప్రభుత్వం చారిత్రక నిర్ణయాలు తీసుకుంటోందని తెలిపారు. 

వడ్డీ లేని రుణాలతోపాటు, మహిళల కోసం ప్రత్యేకంగా తీసుకువచ్చిన బీమా పథకాలు, ఉచిత బస్సు ప్రయాణం, ఉచిత విద్యుత్, రేషన్ కార్డులు, సబ్సిడీ బియ్యం లాంటి పథకాలు నిజమైన సంక్షేమ పాలనకు నిదర్శనమన్నారు.  గత ప్రభుత్వ పాలనలో 8 లక్షల కోట్ల అప్పు తెచ్చి కాలేశ్వరం, మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ లాంటి ప్రాజెక్టులు చేపట్టి ఎంతో అద్భుతం అని చెప్పినా  అవి ఏ పేదవాడికీ ఉపయోగపడలేదన్నారు. 

గత ప్రభుత్వం రూ.3,075 కోట్లు పావలా వడ్డీ రుణాలు పెండింగ్​లో పెట్టిందని, ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటి వరకూ రూ.865 కోట్లు పావల వడ్డీ రుణాలు ఇచ్చామని తెలిపారు. మహిళా సభ్యుల బీమా పథకాన్ని పునరుద్ధరించి, సహజ మరణానికి రూ.2 లక్షలు, ప్రమాద మరణానికి రూ.10 లక్షల బీమా భద్రత కల్పించినట్లు చెప్పారు. గత పాలనలో 18–-60 ఏండ్ల వయస్సులో మాత్రమే మహిళా స్వయం శక్తి సంఘాల్లో  సభ్యత్వం ఉండేదని, ఇప్పుడు 15-–65 ఏళ్ల మహిళలు సభ్యులయ్యే అవకాశం కల్పించినట్లు తెలిపారు. 

మహిళల అభివృద్ధికి దోహదపడేలా వెయ్యి సోలార్ యూనిట్లు, పెట్రోల్ బంకుల నిర్వహణ, మహిళా సంఘాల పేరుపై బస్సుల కొనుగోలు చేపట్టినట్లు తెలిపారు.  ఇందిరమ్మ ఇండ్లు, రేషన్​ కార్డులు, సన్నబియ్యం, ఇతర పథకాల గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో ఇరిగేషన్  డెవలప్​మెంట్ చైర్మన్  మువ్వా విజయ్ బాబు, భద్రాచలం ఐటీడీఏ పీవో రాహుల్, జడ్పీ సీఈవో నాగలక్ష్మి, కొత్తగూడెం ఆర్డీవో మధు, డీఎస్ఓ రుక్మిణి, దమ్మపేట తహసీల్దార్ భగవాన్ రెడ్డి, మహిళా సంఘాల సభ్యులు, అంగన్​వాడీ కార్యకర్తలు పాల్గొన్నారు.