
- 9న అందజేయనున్న మంత్రి పొంగులేటి
- మీడియా అకాడమీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి వెల్లడి
హైదరాబాద్, వెలుగు: వివిధ కారణాలతో చనిపోయిన జర్నలిస్టుల కుటుంబాలకు.. అనారోగ్యం, ప్రమాదాల బారినపడి పనిచేయలేక నిస్సహాయ స్థితిలో ఉన్న జర్నలిస్టులకు వర్కింగ్ జర్నలిస్టుల సంక్షేమ నిధి నుంచి మీడియా అకాడమీ ఆర్థిక సహాయం చేయనుంది. మొత్తం 38 జర్నలిస్టుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.లక్ష ఆర్థిక సహాయంతో పాటు ఐదేండ్ల వరకు ప్రతి కుటుంబానికి నెలకు రూ.3 వేల పెన్షన్ ఇవ్వనున్నారు. ఈ సాయాన్ని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చేతుల మీదుగా ఈ నెల 9వ తేదీన అందజేస్తామని మీడియా అకాడమీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి మంగళవారం ఓ ప్రకటనలో వెల్లడించారు.
పెన్షన్ తో పాటు ఎల్కేజీ నుంచి పదో తరగతి వరకు చదివే ఇద్దరు పిల్లలకు నెలకు రూ.2వేల ట్యూషన్ ఫీజు కూడా అందజేయనున్నట్లు చెప్పారు. ప్రాణాంతక వ్యాధులతో బాధపడుతున్న, ప్రమాదానికి గురై భృతిని కోల్పోయిన జర్నలిస్టులు, ఇతర వ్యాధులకు గురైన వారికి లక్ష రూపాయల చొప్పున, మొత్తం ఎనిమిది మందికి ఆర్థిక సాయం మంజూరు చేశామని శ్రీనివాస్ రెడ్డి వివరించారు. ఈ సందర్బంగా మీడియా అకాడమీ వెబ్సైట్ https://mediaacademy.telangana.gov.in ను, జర్నలిస్ట్ ల ఓరియెంటేషన్ క్లాస్ ల నిర్వహణకు అకాడమీ ప్రచురించిన వివిధ అంశాలతో కూడిన పుస్తకాలను కూడా మంత్రి ఆవిష్కరిస్తారని శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు.