
కేంద్రమంత్రి కిషన్ రెడ్డిపై రాష్ట్రమంత్రి పొన్నం ప్రభాకర్ ఫైర్ అయ్యారు. బీసీ కోటాను అడ్డుకునే కిషన్ రెడ్డికి ప్రజలే బుద్ది చెబుతారని అన్నారు. కేంద్రమంత్రిగా ఉన్న కిషన్ రెడ్డి బీసీలపై మాట్లాడేమాటలు కరెక్ట్ కాదన్నారు. బీసీ కోటా ఇవ్వడం కుదరదని కిషన్ రెడ్డి లేఖ ఇవ్వాలన్నారు. బీసీ కోటాకు బీజేపీ నేతలు అడ్డుపడుతున్నారని విమర్శించారు. బీసీ రిజర్వేషన్లపై కాంగ్రెస్ కు చిత్తశుద్ధి ఉందన్నారు. సమగ్ర కులగణ సర్వేను పకడ్భందీగా నిర్వహించామని చెప్పారు.
కిషన్ రెడ్డి ఏమన్నారంటే.? అశాస్త్రీయమైన సర్వే చేసి, బీసీల సంఖ్యను తగ్గించారని. ఆ తర్వాత దీనికి 10 శాతం ముస్లింలను చేర్చి.. బీసీలను మోసం చేస్తున్నారని అన్నారు . తెలంగాణ ప్రభుత్వం ముస్లింలకు 10 శాతం రిజర్వేషన్లు ఇవ్వడం వల్ల బీసీలకు కేవలం 32 శాతం మాత్రమే రిజర్వేషన్లు అందుతాయని కిషన్ రెడ్డి ఆరోపించారు. ఇది బీసీలను మోసం చేయడమేనని చెప్పారు. ముస్లింలను బీసీల్లో చేర్చడాన్ని బీజేపీ అంగీకరించదన్నారు. ముస్లింలకు రిజర్వేషన్లు తొలగిస్తే, బీసీ రిజర్వేషన్ల బాధ్యతను తాను తీసుకుంటానని అన్నారు కిషన్ రెడ్డి.
బీసీ రిజర్వేషన్లపై హామీ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీనే వాటిని అమలు చేయాలని కిషన్‌రెడ్డి అన్నారు. అది కాకుండా బట్టకాల్చి బీజేపీపై వేస్తామంటే ఊరుకోబోమని మండిపడ్డారు. ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద కాంగ్రెస్ పార్టీ పెట్టుకున్న సభ.. గాంధీ కుటుంబాన్ని పొగడటానికే సరిపోయిందని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో రాజకీయంగా ఎదురవుతున్న ఒత్తిడిని తట్టుకునేందుకు.. గాంధీ కుటుంబం అనుగ్రహం పొందాలన్న లక్ష్యంతో రేవంత్ రెడ్డి.. ఢిల్లీలో సభ పెట్టుకున్నారనేది స్పష్టంగా తెలుస్తున్నదన్నారు. రేవంత్ రెడ్డి తన ప్రసంగంలో.. 50 శాతానికంటే ఎక్కువ సమయం, రాహుల్, సోనియా జపం చేయడానికే సరిపోయిందని విమర్శించారు.
‘‘బీసీ రిజర్వేషన్లు ఇస్తామని తెలంగాణ ప్రజలకు కాంగ్రెస్ హామీ ఇచ్చింది.. దాన్ని పూర్తిచేసుకోవాల్సిన బాధ్యత ఆ పార్టీదే. అందుకోసం న్యాయపరమైన, చట్టపరమైన అంశాలపై దృష్టిసారించి, చిత్తశుద్ధితో పనిచేయాలి తప్ప.. బట్టకాల్చి బీజేపీ మీద వేస్తానంటే చూస్తూ ఊరుకునేది లేదు” అని ఆయన అన్నారు.