హైదరాబాద్, వెలుగు: తెలంగాణలో అన్ని వ్యవస్థలను భ్రష్టు పట్టించడంలో హరీశ్ రావు కీలక పాత్ర పోషించారని మంత్రి పొన్నం ప్రభాకర్ ఆరోపించారు. ఆయనే పదేండ్ల కేసీఆర్ పాలనలో ఇరిగేషన్ మంత్రిగా, ఆర్థిక మంత్రిగా, ఆరోగ్య శాఖ మంత్రిగా పనిచేశారని గుర్తుచేశారు. అప్పుడు కలెక్షన్స్ సెంటర్లు నడిపి ఇప్పుడు రైతుల కోసం కాల్ సెంటర్లు అంటూ డ్రామాలాడుతున్నాడని తెలిపారు.
ఎన్నికల్లో ప్రజలు గట్టిగా బుద్ధి చెప్పినా హరీశ్ అహంకారం మాత్రం తగ్గలేదని మండిపడ్డారు. ఈ మేరకు సోమవారం మంత్రి ఓ ప్రకటన రిలీజ్ చేశారు. " హరీశ్ రావు ఆర్థిక మంత్రిగా ఉన్నప్పుడు పంట రుణమాఫీ 3 లక్షల మంది అర్హులైన రైతులకు అమలు కాలేదు. ఆ విషయం ఆయనకూ తెలుసు. రుణమాఫీ కాకపోవడంతో వేల మంది రైతులను బ్యాంకులు బ్లాక్ లిస్టులో పెట్టి కొత్త రుణాలు పుట్టకుండా చేశాయి.
అప్పుడు హరీష్ రావు ఎక్కడున్నారు? ఏ కలుగులో దాచుకున్నారు? ఆత్మహత్య చేసుకున్న ఒక్క రైతునైనా హరీశ్ పరామర్శించాడా? అప్పుడే కాల్ సెంటర్ల పెట్టుకొని ఉంటే బాగుండేది" అని పొన్నం ఎద్దేవా చేశారు. రేవంత్ సర్కార్ ఇప్పటికే లక్షన్నర వరకు ఉన్న రుణాలను మాఫీ చేసిందన్నారు. అతిత్వరలోనే రెండు లక్షల వరకు రుణమాఫీ చేస్తుందని వెల్లడించారు. సాంకేతిక సమస్యలతో రుణమాఫీ కానీ రైతులనూ ఆదుకుంటామని పేర్కొన్నారు.
ఒక్క బస్సు కొనలేదు
కేసీఆర్ సర్కార్ కొత్తగా ఒక్క బస్సు కొనలేదని పొన్నం తెలిపారు." మీరు బస్సులు ఆర్డర్ చేస్తే.. మేం రిబ్బన్ కట్ చేశామా?మీ హయంలో ఒక్క బస్సు అయినా కొనుగోలు చేశారా..? ఒకవేళ అదే నిజమైతే మీకే క్రెడిట్ ఇస్తాం. కాలం బాగుంటే మీ ఖాతాలో.. కరువు వస్తే పక్కోడి ఖాతాలో వేసే నైజం మీది. అప్పులకైతే బాధ్యత వహించారట. అభివృద్ధి కార్యక్రమాలు మాత్రం మాయే అని డబ్బా కొట్టుకుంటున్నారు. ఇదేమి రాజకీయం..? మీకు అహంకారం తగ్గలేదు" అని మంత్రి పేర్కొన్నారు.
పొన్నంను కలిసిన రాజగోపాల్ రెడ్డి
మునుగోడు సమస్యలపై మంత్రి పొన్నం ప్రభాకర్ కు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి వినతి పత్రం అందచేశారు. 21 కొత్త రూట్లలో పలు గ్రామాలను కలుపుతూ ఆర్టీసీ బస్సులు నడిపించాలని కోరారు. ప్రతి మండల కేంద్రంలో బస్ స్టేషన్లను డెవలప్ చేయాలన్నారు. నియోజకవర్గంలోని నాంపల్లి , నారాయణపూర్ మండలాలకు నూతన బస్ షెల్టర్ల నిర్మాణం చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ అంశాలపై ఆర్టీసీ ఉన్నతాధికారులతో మాట్లాడి బస్సులు నడిపేలా చర్యలు తీసుకుంటామని మంత్రి హామీ ఇచ్చారు.
