- కౌన్సిల్లో బీఆర్ఎస్ నేతలపై మంత్రి పొన్నం ఫైర్
హైదరాబాద్, వెలుగు: మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని ప్రతిపక్షాలు విమర్శిస్తూ, సోషల్ మీడియాలో అవమాన ప్రచారం చేస్తున్నారని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఫైర్అయ్యారు. “ఫ్రీ బస్ జర్నీ ద్వారా విద్య, ఉద్యోగాలు, ఉపాధి కోసం వెళ్లే మహిళలకు లాభం జరుగుతోంది. ఆర్టీసీ ఆక్యుపెన్సీ పెరుగుతూ లాభం పొందుతోంది. దీనిపై సమస్య ఏమిటి? ప్రతిపక్షం వైఖరి స్పష్టం చేయాలి” అని మంత్రి ప్రశ్నించారు. బుధవారం శాసనమండలిలో బీఆర్ఎస్ నేతలు అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానమిచ్చారు.
మహాలక్ష్మి పథకం ద్వారా ఆర్టీసీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడిందని, సీసీఎస్ బకాయిలను రూ.664 కోట్ల నుంచి రూ.300 కోట్లకు, పీఎఫ్ బకాయిలను రూ.1,350 కోట్ల నుంచి రూ.600 కోట్లకు తగ్గించామని తెలిపారు. బస్ స్టేషన్ల మౌలిక సదుపాయాల కోసం రూ.100 కోట్లు ఖర్చు చేశారని, ములుగు జిల్లా ఏటూరు నాగారం, పెద్దపల్లి ప్రాంతాల్లో కొత్త డిపోలను ఏర్పాటు చేసి, 600 బస్సులకు మహిళా సంఘాలను యజమానులుగా నెలకు రూ.70 వేల ఆదాయం కల్పిస్తున్నట్లు చెప్పారు.
