పవన్.. క్షమాపణ చెప్పిన తర్వాతే తెలంగాణలో సభ పెట్టుకో: మంత్రి పొన్నం ప్రభాకర్

పవన్..  క్షమాపణ చెప్పిన తర్వాతే  తెలంగాణలో సభ పెట్టుకో: మంత్రి పొన్నం ప్రభాకర్

ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌  పై  మంత్రి పొన్నం ప్రభాకర్  తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడిన పొన్నం ప్రభాకర్... పవన్ కళ్యాణ్ తెలంగాణ ప్రజలకు క్షమాపణలు చెప్పిన తర్వాతే ఇక్కడ నవ నిర్మాణ సభ పెట్టుకోవాలని డిమాండ్ చేశారు. అనువణువునా తెలంగాణ వ్యతిరేకతను నింపుకున్న పవన్... ఇప్పుడు తెలంగాణ అస్తిత్వాన్ని, ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా బీజేపీ ఎజెండాను మోస్తున్నారని మండిపడ్డారు.

గతంలో తెలంగాణ ఉద్యమ సమయంలో పవన్ చేసిన కామెంట్స్‌ను మంత్రి ఈ సందర్భంగా గుర్తుచేశారు. తెలంగాణ వస్తే పదకొండు రోజులు అన్నం తినలేదని... ఇక్కడి ప్రజల కళ్ల దృష్టి పడితే కోనసీమ కొబ్బరి చెట్లు ఎండిపోయాయంటూ విషం కక్కిన వ్యక్తి... రేపు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజు ఇక్కడే ఎందుకు సభ పెడుతున్నారని ప్రశ్నించారు. కన్నతల్లికి గాజులు కొనలేని వాడు... పినతల్లికి ఒడ్డాణం చేయిస్తాడట అన్న సామెతను గుర్తు చేస్తూ... ఏపీలో కూట్ల రాయి తీయలేని వాడు, ఇక్కడికి వచ్చి ఎట్లా రాయి తీస్తాడంటూ ఎద్దేవా చేశారు. ఏపీ ప్రజలు ఇచ్చిన అధికారంతో అక్కడ నవ నిర్మాణం చూపించాలని, ఇక్కడకు వచ్చి మొసలి కన్నీరు కారిస్తే ఒప్పుకోమని హెచ్చరించారు.

పవన్ కళ్యాణ్‌ కేవలం బీజేపీ డైరెక్షన్‌లో ఆడుతున్న ఒక నటుడని మంత్రి పొన్నం ప్రభాకర్ సంచలన ఆరోపణ చేశారు. బీజేపీ రెమ్యునరేషన్ ఇస్తే ఇక్కడికి రాలేదని కొండగట్టు అంజన్న మీద ప్రమాణం చేసి చెప్పగలవా పవన్ కళ్యాణ్? అంటూ సవాల్ విసిరారు. తెలంగాణలో బీజేపీ పప్పులు ఉడకకనే... దొడ్డిదారిన ఏజెంట్‌గా పవన్‌ను ఇక్కడికి పంపిస్తోందన్నారు. హైదరాబాద్‌లో పెట్టబోయే నవనిర్మాణ సభ వెనుక ఉన్న ఆంతర్యం... తెలంగాణను బీజేపీకి తాకట్టు పెట్టడమేనా అని నిలదీశారు. ఇదే సభను బీజేపీ పాలిత రాష్ట్రాలైన గుజరాత్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్‌లలో ఎందుకు పెట్టడం లేదని... కేవలం మీ బాస్ మోదీని మెప్పించడానికే ఇక్కడ విద్వేషాలు రెచ్చగొడుతున్నారా అని ఆగ్రహం వ్యక్తం చేశారు.

చేగువేరా టీ షర్ట్‌తో ప్రారంభమైన పవన్ ప్రస్థానం... ఇప్పుడు మోదీని కౌగిలించుకొని ప్రజల చేత చీవాట్లు తినే పరిస్థితికి చేరిందని ఎద్దేవా చేశారు. వైజాగ్ స్టీల్ ప్లాంట్‌ను ప్రైవేటుపరం చేస్తుంటే, పోర్టులను అదానీకి కట్టబెడుతుంటే ప్రశ్నించని చేతగానితనం నీది కాదా అని దుయ్యబట్టారు. దేశంలో పెట్రోల్ ధరలు పెరుగుతుంటే, నిరుద్యోగం తాండవిస్తుంటే నోరు మెదపని పవన్... కేవలం సినిమాల్లో దేశభక్తి చూపించడం కాదు, నిజ జీవితంలో చూపించాలన్నారు. పవన్ అభిమానులంతా సినిమాలు చూసి ఆదరించాలని... కానీ రాజకీయాల పేరుతో మన తెలంగాణ అస్తిత్వం మీద దాడి చేస్తే మాత్రం ఎవరూ చూస్తూ ఊరుకోరని, తీవ్ర పరిణామాలు ఉంటాయని మంత్రి పొన్నం ప్రభాకర్ గట్టిగా హెచ్చరించారు.