ఆస్తులు సృష్టిస్తే.. పేదలకు ఇండ్లు ఎందుకివ్వలే : పొన్నం ప్రభాకర్

ఆస్తులు సృష్టిస్తే.. పేదలకు ఇండ్లు ఎందుకివ్వలే : పొన్నం ప్రభాకర్

హైదరాబాద్, వెలుగు : ఉద్యోగులకు సకాలంలో జీతాలివ్వలేని స్థితికి రాష్ట్ర ఖజానాను బీఆర్ఎస్ దిగజార్చిందని మంత్రి పొన్నం ప్రభాకర్ మండిపడ్డారు. కనీసం పెన్షన్లు కూడా టైమ్​కు ఇవ్వలేకపోయిందని విమర్శించారు. పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కేటాయించలేదన్నారు. హుస్నాబాద్ నియోజకవర్గంలో ఓ పేద కుటుంబ పరిస్థితిని సభలో పొన్నం ప్రస్తావించారు. ప్రభుత్వ డబ్బులు బీరువాలు, ఖజానాలో ఉండవని హరీశ్ రావు చేసిన కామెంట్లను ఆయన ఖండించారు. 

ప్రభుత్వ డబ్బులు ఎక్కడ ఉంటాయో తెల్వని స్థితిలో తమ ఎమ్మెల్యేలు ఎవరూ లేరన్నారు. ప్రభుత్వ ఆర్థిక పరిస్థితి ప్రజలకు వివరిస్తుంటే.. బీఆర్ఎస్​కు అంత ఉలికిపాటు ఎందుకని ప్రశ్నించారు. అభివృద్ధి చేశామని గోబెల్స్ ప్రచారం చేస్తే అది నిజమైపోదన్నారు. ‘‘అభివృద్ధి అంటే చాలు.. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు బిల్డింగ్​ల గురించి మాట్లాడుతున్నరు. మరి.. పేదల డబుల్ బెడ్రూమ్ ఇండ్ల గురించి, టైమ్​కు జీతాలు, రిటైర్ అవుతున్న ఉద్యోగులకు బెనిఫిట్స్ ఇవ్వలేని పరిస్థితిలో ఉన్న ఆర్థిక వ్యవస్థపై ఎందుకు మాట్లాడటం లేదు?”అని పొన్నం ప్రశ్నించారు.

విద్యార్థులకు మెస్ చార్జీలు కూడా ఇయ్యలె

ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం గ్రీన్ చానెల్ క్రియేట్ చేసి విద్యార్థులకు స్కాలర్​షిప్​లు వేసిందని పొన్నం గుర్తుచేశారు. కానీ, బీఆర్ఎస్ ప్రభుత్వం కనీసం మెస్ చార్జీలు కూడా చెల్లించలేకపోయిందని విమర్శించారు. 18 నెలలుగా బిల్లులను పెండింగ్​లో పెట్టిందన్నారు. కిరాయిలు కట్టకపోవడంతో కొన్ని హాస్టళ్లు ఖాళీ చేయించారని తెలిపారు. 2014కు ముందు కాంగ్రెస్ ప్రభుత్వం గౌరవెల్లి ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసిందని, డిస్ట్రిబ్యూటరీలను సిద్ధం చేసిందని అన్నారు. కుర్చీ వేసుకుని గౌరవెల్లి ప్రాజెక్టు కడతానన్న కేసీఆర్.. దాన్ని పూర్తి చేయలేకపోయారని ఫైర్ అయ్యారు. గ్రీన్ చానెల్ క్రియేట్ చేసి బీసీ, ఎస్సీ, ఎస్టీ స్టూడెంట్స్​కు స్కాలర్​షిప్​లు, మెస్ చార్జీలు రిలీజ్ చేస్తామని తెలిపారు.