
- జూబ్లీహిల్స్లో పదేండ్లలో ఒక్క ఇల్లయినా కట్టించారా?
హైదరాబాద్, వెలుగు: ఇండ్లు కూలగొట్టుడు గురించి మాట్లాడే అర్హత కేటీఆర్ కు లేదని మంత్రి పొన్నం ప్రభాకర్ ఫైర్అయ్యారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో చిన్న శ్రీశైలం యాదవ్ ఇంటిని కేటీఆర్ కూలగొట్టియ్య లేదా? అని బుధవారం విడుదల చేసిన ఓ ప్రకటనలో ఆయన ప్రశ్నించారు. పదేండ్లు పాలించిన బీఆర్ఎస్ ఈ నియోజకవర్గంలో ఒక్క ఇల్లు అయినా కట్టించిందా? అని పొన్నం నిలదీశారు.
ఎన్నికలు, ఉప ఎన్నికలంటే బీరు, బిర్యానీ కల్చర్ తెచ్చిందే కేటీఆర్ అని పొన్నం మండిపడ్డారు. హుజురాబాద్, దుబ్బాక, మునుగోడు ఉప ఎన్నికల్లో కోట్ల డబ్బు, లిక్కర్ సిసాలు పంచింది బీఆర్ఎస్ కాదా? అని ప్రశ్నించారు. 18 ఏండ్లు నిండితే చాలు.. ఎన్నికల్లో నిర్బంధ మద్యం విధానాన్ని అమలు చేసిందే బీఆర్ఎస్ అని విమర్శించారు. ‘‘జూబ్లీహిల్స్ లో బీఆర్ఎస్ గెలిస్తే ఏం లాభం ఉండదు.
ప్రభుత్వమేమి మారదు. కాంగ్రెస్ ను ఆశీర్వదిస్తేనే ఇక్కడ అభివృద్ధి జాతర జరుగుతుంది. ఎన్నికలొస్తేనే కేటీఆర్ వస్తాడు. కూట్లో రాయిని తీయనోడు.. ఏట్లో రాయి తీస్తడా? సొంత చెల్లికి న్యాయం చేయలేనోడు జూబ్లీహిల్స్ కు ఏమి చేస్తడు. కానీ, మీకు ఏ అవసరం వచ్చినా మేము అందుబాటులో ఉంటాం’’అని పొన్నం పేర్కొన్నారు. మాగంటి గోపినాథ్ మీద ప్రేమ ఉంటే.. బీఆర్ఎస్ పాలనలో మంత్రి పదవి ఎందుకు ఇవ్వలేదని మంత్రి పొన్నం నిలదీశారు.