ఫలక్నుమా ఆర్వోబీ ఓపెన్

ఫలక్నుమా ఆర్వోబీ ఓపెన్
  • ప్రారంభించిన మంత్రి పొన్నం ప్రభాకర్
  • బార్కస్​ జంక్షన్​లో తగ్గనున్న ట్రాఫిక్

హైదరాబాద్ సిటీ, వెలుగు: హైదరాబాద్ సిటీలో మరో కొత్త ఫ్లైఓవర్ అందుబాటులోకి వచ్చింది. సికింద్రాబాద్–​--ఫలక్​నుమా బ్రాడ్​గేజ్ లైన్​లో ఫలక్​నుమా వద్ద ఇప్పటికే ఉన్న ఆర్వోబీ (రోడ్డు ఓవర్ బ్రిడ్జి)కి సమాంతరంగా నిర్మించిన మరో ఆర్వోబీని శుక్రవారం హైదరాబాద్ ఇన్​చార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్, మేయర్ గద్వాల్ విజయలక్ష్మితో కలిసి ప్రారంభించారు. ఈ ప్రాజెక్టును రూ.52.03 కోట్లతో 360 మీటర్ల పొడవు, నాలుగు లేన్లతో జీహెచ్ఎంసీ, దక్షిణ మధ్య రైల్వే లు సంయుక్తంగా నాలుగేండ్లలో పూర్తి చేశాయి. పాత ఆర్వోబీ పునరుద్ధరణతో పాటు కొత్తది బార్కస్ జంక్షన్ నుంచి ఫలక్​నుమా బస్ డిపో, రైల్వే స్టేషన్, చార్మినార్ వైపు వెళ్లే వాహనాదారుల ట్రాఫిక్ ఇబ్బందులను తొలగిస్తుందని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు.

 ఫలక్‌‌నుమా, చాంద్రాయణగుట్ట, ఇంజిన్ బౌలి వంటి ప్రాంతాల్లో ప్రయాణికులకు ఊరట లభిస్తుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యుడు అనిల్ కుమార్ యాదవ్, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ, ఎమ్మెల్సీలు మీర్జా రియాజ్‌‌ఉల్ హసన్ ఎఫెండీ, మీర్జా రహమత్ బేగ్, ఎమ్మెల్యేలు మహ్మద్ ముబీన్, మీర్ జల్ఫీకర్ అలీ, జీహెచ్‌‌ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్, చార్మినార్ జోనల్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి, ప్రాజెక్ట్స్ చీఫ్ ఇంజనీర్ భాస్కర్ రెడ్డి, కార్పొరేటర్లు పాల్గొన్నారు.