అగ్నిప్రమాద బాధితులను ఆదుకుంటాం : పొన్నం ప్రభాకర్

అగ్నిప్రమాద బాధితులను ఆదుకుంటాం :  పొన్నం ప్రభాకర్

కరీంనగర్, వెలుగు: అగ్నిప్రమాదంలో సర్వస్వం కోల్పోయిన బాధిత కుటుంబాలను ప్రభుత్వం తరఫున అన్ని విధాలా ఆదుకుంటామని బీసీ సంక్షేమం, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ హామీ ఇచ్చారు. కరీంనగర్ ఆదర్శనగర్ లో మంగళవారం జరిగిన అగ్ని ప్రమాదంలో సుమారు 21 గుడిసెలు దగ్ధమైన విషయం తెలిసిందే. బుధవారం మంత్రి పొన్నం ఘటనా స్థలాన్ని పరిశీలించి ప్రమాదం జరిగిన తీరు.. నష్టం వివరాలు అడిగి తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ అగ్ని ప్రమాదంలో నష్టపోయిన వారంతా రోజువారీ కూలీపని చేసుకునే పేదలేనని, ప్రమాదంలో బట్టలు, నిత్యావసర వస్తువులు, సర్టిఫికెట్లు దగ్ధం కావడం దురదృష్టకరమన్నారు. వీరికి తాత్కాలికంగా భోజన వసతి, నివాస ఏర్పాట్లు చేశామని, ప్రభుత్వంతోపాటు పార్టీ తరఫున కూడా సామాగ్రి అందిస్తామని చెప్పారు.

ఇందిరమ్మ ఇండ్లలో వీరికి మొదటి ప్రాధాన్యతలో ఇండ్లు మంజూరుచేస్తామన్నారు. ఆయన వెంట ఆర్డీవో మహేశ్వర్, మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్, కార్పొరేటర్ మేచినేని అశోక్ రావు, కాంగ్రెస్ లీడర్లు కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, వైద్యుల అంజన్ కుమార్, అధికారులు పాల్గొన్నారు.