
- సబ్బండ వర్గాలను కలుపుకొని రాజ్యాధికారం సాధించిండు: మంత్రి పొన్నం
- ఆయన ఆశయాలనుముందుకు తీసుకెళ్లాలి
- ఈ ఏడాది 40 లక్షల ఈత మొక్కలు నాటుతం
- బీసీ వర్గాలకు అండగా ఉంటానని వెల్లడి
హైదరాబాద్, వెలుగు: సర్దార్ సర్వాయి పాపన్న సబ్బండ వర్గాలను కలుపుకొని రాజ్యాధికారాన్ని స్థాపించి చరిత్రలో నిలిచారని బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ఆదివారం రవీంద్రభారతిలో సర్దార్ పాపన్న మహారాజ్ ధర్మ పరిపాలన సంస్థ (ఎస్పీడీపీవో) జై గౌడ్ ఉద్యమం, జాతీయ కమిటీ సంయుక్త ఆధ్వర్యంలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ మహరాజ్ 375 వ జయంతి జాతీయ వారోత్సవాల్లో మంత్రి పాల్గొని మాట్లాడారు.
గ్రామాల్లో ఉన్న సామాజిక పరిస్థితుల దృష్ట్యా అన్ని వర్గాలను కలుకొని పని చేసినప్పుడే సర్వాయి పాపన్న ఆశయాలను ముందుకు తీసుకెళ్లిన వాళ్లం అవుతామని తెలిపారు. అన్ని వర్గాల ప్రజలకు అందుబాటులో ఉంటానని, ఎవరికి ఏ సమస్య ఉన్నా తన దృష్టికి తీసుకువస్తే పరిష్కరిస్తానని మంత్రి పొన్నం హామీ ఇచ్చారు. హైదరాబాద్ లో సర్దార్ పాపన్న విగ్రహం ఏర్పాటు చేస్తామని, తాను, పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ దీన్ని ప్రాధాన్యతాంశంగా తీసుకున్నామన్నారు.
రాజకీయాలకు అతీతంగా సంక్షేమం కోసం పనిచేసుకుంటూ ముందుకు వెళ్లాలని పిలుపునిచ్చారు. హుస్నాబాద్ నియోజకవర్గంలోని సర్వాయిపేటలో ఉన్న పాపన్న గౌడ్ కోటకు రూ.5 కోట్లు కేటాయించి అభివృద్ధి చేసుకుంటున్నామని చెప్పారు. ఈ నెల 17న సైదాపూర్ లో పాపన్న గౌడ్ విగ్రహావిష్కరణ చేయనున్నట్లు వెల్లడించారు. బలహీన వర్గాల సంక్షేమానికి కృషి చేస్తానని, కోకాపేటలో కుల సంఘాలకు కేటాయించిన స్థలాల అభివృద్ధిపై అందిరితో చర్చించి నిర్ణయం తీసుకుందామన్నారు.
యాదగిరిగుట్ట, వేములవాడ, కరీంనగర్ లో గౌడ సత్రం నిర్మించామని, అలంపురం జోగులాంబ ఆలయం వద్ద స్థలం కొన్నామని.. అక్కడ కూడా సత్రం కడతామన్నారు. ఈ ఒక్క ఏడాదిలోనే 40 లక్షల ఈత మొక్కలు నాటుతున్నామన్నారు. ప్రభుత్వ స్థలాలు, చెరువు కట్టల వద్ద గౌడ సోదరులు ఈత మొక్కలు నాటాలన్నారు. ఈ కార్యక్రమంలో పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్, బీసీ కార్పొరేషన్ చైర్మన్ నూతి శ్రీకాంత్ గౌడ్, బాలరాజు గౌడ్ మాజీ మంత్రులు శ్రీనివాస్ గౌడ్, జోగి రమేశ్, మాజీ ఎంపీ భరత్ గౌడ్, గుల్బర్గా ఎమ్మెల్సీ జయదేవ్ గుత్తా తదితరులు పాల్గొన్నారు.