బీసీల నోటికాడి ముద్ద లాగొద్దు..తమిళనాడు తరహాలో జీవో జారీ చేసినం: మంత్రి పొన్నం

బీసీల నోటికాడి ముద్ద లాగొద్దు..తమిళనాడు తరహాలో జీవో జారీ చేసినం: మంత్రి పొన్నం
  • బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇస్తే  ఎస్సీ, ఎస్టీలకు ఎలాంటి ఇబ్బంది ఉండదు 
  • బలహీనవర్గాలకు రిజర్వేషన్లు పెంచితే  ప్రతిపక్షానికి ఎందుకంత బాధ?
  • మేం చట్టప్రకారమే ఇచ్చాం..కాపాడుకునే బాధ్యత తెలంగాణ సమాజానిదేనని వెల్లడి

హైదరాబాద్​, వెలుగు: బీసీల నోటికాడి ముద్దను ఎవరూ లాగొద్దని, అగ్రవర్ణాలవారికి 10 శాతం ఈడబ్ల్యూఎస్​ రిజర్వేషన్లు కల్పిస్తే ఎవరూ వ్యతిరేకించలేదని బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తే..  ఎస్సీ, ఎస్టీలకు రాజ్యాంగబద్ధంగా వచ్చిన రిజర్వేషన్లకు ఎలాంటి ఇబ్బంది ఉండబోదని తెలిపారు.

 ‘‘బలహీనవర్గాలకు రిజర్వేషన్లు పెంచితే మీకెందుకంత బాధ’’ అని ప్రతిపక్షాన్ని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. శనివారం హైదరాబాద్​లో మంత్రి పొన్నం ప్రభాకర్‌‌‌‌‌‌ మీడియాతో మాట్లాడారు.  సీఎం  రేవంత్‌‌రెడ్డి నాయకత్వంలో కుల గణన సర్వే నిర్వహించామని, ఆ సర్వే ఆధారంగా సబ్ కమిటీ ఏర్పాటు చేసి రిజర్వేషన్లు పెంచే నిర్ణయం తీసుకున్నామని వివరించారు. 

ఈ నిర్ణయానికి చట్టసభల్లో అన్ని పార్టీల మద్దతు లభించిందని, మూడ్ ఆఫ్ హౌజ్ తీసుకున్న తర్వాతే బీసీ బిల్లు ఆమోదించి, గవర్నర్‌‌కు పంపించామని చెప్పారు. అనంతరం ఆమోదం కోసం బిల్లును రాష్ట్రపతికి గవర్నర్ పంపారని తెలిపారు.

తమిళనాడు తరహాలో..

రాష్ట్రాలు పంపిన బిల్లులు గవర్నర్, రాష్ట్రపతి దగ్గర చాలా కాలం పెండింగ్‌లో ఉంటే  వాటిని రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేసుకోవచ్చని ఇటీవల తమిళనాడు కేసులో సుప్రీంకోర్టు ఆదేశాలు జారీచేసిందని మంత్రి పొన్నం ప్రభాకర్‌‌ తెలిపారు.  దీని ప్రకారమే  రాష్ట్రంలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయడానికి జీవో నెంబర్ 9 తీసుకొచ్చామని వెల్లడించారు.

 చట్టాలు, న్యాయాల పట్ల తమకు గౌరవం ఉందని చెప్పారు.  తమిళనాడు రాష్ట్రంలో 60% రిజర్వేషన్లు అమలవుతున్నాయని పేర్కొన్నారు. ‘‘బలహీన వర్గాల బిడ్డగా, బలహీన వర్గాల మంత్రిగా రాష్ట్ర ప్రభుత్వం పక్షాన మీకు విజ్ఞప్తి చేస్తున్నా.. తెలంగాణ కోసం సకలజనులు ఎలా కొట్లాడాయో.. బలహీన వర్గాలకు 42 శాతం  రిజర్వేషన్లు కాపాడుకునే బాధ్యత తెలంగాణ సమాజం మీదే ఉన్నది’’ అని అన్నారు. 

ఇవి రాజకీయ రిజర్వేషన్లు మాత్రమే కాదని.. భవిష్యత్తులో విద్యా, ఉద్యోగాల్లో కూడా వర్తింపజేస్తామని చెప్పారు. కోర్టుకు వెళ్లే హక్కు అందరికీ ఉందన్నారు. తమిళనాడులో కోర్టుకు వెళ్లినా అక్కడి ప్రభుత్వం విజయం సాధించిందని మంత్రి పొన్నం గుర్తుచేశారు.  బలహీనవర్గాల అభ్యున్నతికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని, బీసీలకు 42 శాతం రిజర్వేషన్లతోనే స్థానిక ఎన్నికలకు వెళ్తామని స్పష్టం చేశారు.