ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం పూర్తికాలే : మంత్రి పొన్నం

ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం పూర్తికాలే :  మంత్రి పొన్నం
  • ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం పూర్తికాలే
  • ఉద్యోగులను మాత్రమే సర్కార్‌‌‌‌లో కలిపారు: మంత్రి పొన్నం 
  • కేసీఆర్ రద్దు చేసిన ఆర్టీసీ సంఘాలతో సమావేశమవుతాం
  • మహిళలకు ఫ్రీ జర్నీపై 15 రోజులకోసారి సమీక్షిస్తాం
  • రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై వైట్‌‌ పేపర్‌‌‌‌ రిలీజ్‌‌ చేస్తామని వెల్లడి

హైదరాబాద్, వెలుగు : గత బీఆర్‌‌‌‌ఎస్‌‌ సర్కార్‌‌‌‌ ఆర్టీసీని పూర్తిగా ప్రభుత్వంలో విలీనం చేయలేదని, కేవలం ఉద్యోగులనే విలీనం చేసిందని రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ప్రభుత్వంలో సంస్థ ఆస్తులు ఇంకా విలీనం కాలేదన్నారు. మాజీ సీఎం కేసీఆర్ ఆర్టీసీ సంఘాలను రద్దు చేశారని, వాటిని పునరుద్ధరిస్తామని చెప్పారు. ఆయా సంఘాల నాయకులను సంప్రదించి సంస్థ విలీనంపై ముందుకెళ్తామని తెలిపారు. త్వరలో బస్ భవన్‌‌లో సమావేశమై, వారి నుంచి ఫీడ్ బ్యాక్ తీసుకుంటామన్నారు. 

సంస్థను ఎట్టి పరిస్థితుల్లో నిర్వీర్యం కానివ్వబోమని ఆయన స్పష్టం చేశారు. ఆదివారం గాంధీ భవన్‌‌లో పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేశ్ కుమార్ గౌడ్‌‌తో కలిసి మీడియాతో ఆయన మాట్లాడారు. సోనియా గాంధీ ప్రకటించిన ఆరు గ్యారంటీల్లో మొదటిది మహాలక్ష్మి స్కీమ్‌‌లో భాగంగా మహిళలకు ఫ్రీ బస్సు జర్నీ హామీని నిలబెట్టుకున్నామని తెలిపారు. 15 రోజులకోసారి మహిళలకు ఫ్రీ జర్నీపై సమీక్ష నిర్వహిస్తామని, ఏవైనా లోపాలుంటే సరి చేసుకుంటామని తెలిపారు. 

మహిళలకు ఫ్రీ జర్నీతో ఆర్టీసీకి నష్టం కలగకుండా కంపెన్సేట్ చేస్తామని, కార్మికుల సంక్షేమాన్ని కూడా చూసుకుంటామని వెల్లడించారు. ప్రయాణికుల సౌకర్యం, ఆర్టీసీ కార్మికుల సంక్షేమం తమకు రెండు కళ్ల లాంటివన్నారు. ఏపీతో ఏమైనా సమస్యలుంటే సామరస్యంగా పరిష్కరించుకుంటామని చెప్పారు. ఆటో డ్రైవర్ల ఆందోళనలనూ పరిగణనలోకి తీసుకుంటామని, వారితో త్వరలో చర్చిస్తామని తెలిపారు. 

బీఆర్‌‌‌‌ఎస్‌‌ మంత్రులు విచక్షణ కోల్పోయారు..

గత పాలనలో ప్రజలు, ప్రతిపక్షాలు, మీడియా, ప్రజాస్వామ్యవాదులకు సెక్రటేరియెట్, ప్రగతి భవన్‌‌లోకి అనుమతి లేకుండా పోయిందని మంత్రి పొన్నం అన్నారు. సమస్యలు చెప్పుకునే అవకాశం లేకుండా చేశారని మండపడ్డారు. తమ ప్రభుత్వంలో 24 గంటలు ప్రజలకు అందుబాటులో ఉండేలా వ్యవస్థను మార్చామన్నారు. ప్రజల సమస్యలు విని వాటిని పరిష్కరించేందుకు ప్రజా దర్బార్‌‌‌‌ను నిర్వహిస్తున్నామని తెలిపారు. 

అన్ని జిల్లాలల్లో ఈ కార్యక్రమాన్ని విస్తరిస్తామని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి రెండ్రోజులు కూడా కాకముందే బీఆర్‌‌‌‌ఎస్‌‌ మాజీ మంత్రులు విచక్షణ కోల్పోయి మాట్లాడుతున్నారని ఫైర్‌‌‌‌ అయ్యారు. ‘అవెప్పుడిస్తవ్.. ఇవెప్పుడిస్తవ్..’అంటూ ప్రశ్నిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వారు అధికారంతో పాటు విచక్షణ కూడా కోల్పోయారని మండిపడ్డారు. గత 9 ఏండ్లలో రాష్ట్రాన్ని ఏం చేశారో, రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని ఎంతలా దిగజార్చారో ప్రజలకు వివరిస్తామని, దీనికి సంబంధించి వైట్‌‌​పేపర్ రిలీజ్ చేస్తామని స్పష్టం చేశారు. 

ఆర్థిక వ్యవస్థను ఎట్లా పునరుద్ధరించాలో సమీక్ష చేస్తామని వెల్లడించారు. అంచెలంచెలుగా ఎదిగిన నాయకుడు పొన్నం ప్రభాకర్ అని పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేశ్ కుమార్ గౌడ్ అన్నారు. తాము ప్రకటించిన ఆరు గ్యారంటీలను తప్పకుండా అమలు చేస్తామని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో ఫిషర్‌‌‌‌మెన్ కాంగ్రెస్ సెల్ చైర్మన్ మెట్టు సాయి, శ్రీకాంత్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. 

బీసీ బంధుకు తాత్కాలిక బ్రేక్..

బీసీ బంధుకు తాత్కాలికంగా బ్రేక్ పడనుందని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. గత ప్రభుత్వంలో ఆ పథకం అమలు సరిగ్గా జరగలేదని చెప్పారు. ఆదివారం ఆయన మీడియాతో చిట్ చాట్‌‌లో మాట్లాడారు. బీసీ బంధు పథకాన్ని తాము రివ్యూ చేసి అవినీతికి తావివ్వకుండా, పారదర్శకంగా అమలు చేస్తామని వెల్లడించారు. కాగా, పోర్ట్ ఫోలియో పెద్దదా.. చిన్నదా అని ఉండదని, మంత్రులంతా ఒక్కటేనని పేర్కొన్నారు. 

బీజేపీ ఎంపీ బండి సంజయ్ ఎప్పుడూ గ్రౌండ్‌‌లో లేరని, ఆయనది ఒడిసిన అధ్యాయమన్నారు. ఎంపీ అయ్యాక ఆయన ప్రజలకు అందుబాటులో లేరని ఆరోపించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడయ్యాక సంజయ్‌‌ను మీడియా ఆకాశానికి ఎత్తుకుందన్నారు. కాగా, తాను ఎంపీగా ఉన్నప్పుడు రూరల్ ఏరియాల్లో తనకు మంచి పట్టు ఉందని, అందుకే హుస్నాబాద్ నుంచి పోటీ చేశానని, అక్కడి ప్రజలతో తన బంధం ప్రత్యేకమైనదన్నారు.