
తెలంగాణ రాష్ట్రంలోని క్యాబ్ డ్రైవర్లు, ఫుడ్ డెలవరీ బాయ్ లు, ఆటో డ్రైవర్ల కోసం రూ.5 లక్షల యాక్సిడెంటల్ పాలసీ తీసుకురావడంతోపాటు రాజీవ్ ఆరోగ్యశ్రీ ద్వారా రూ.10 లక్షల వరకు ఉచిత వైద్యం అందించాలని నిర్ణయం తీసుకున్నామని రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ చెప్పారు. ఇటీవల కుక్క కాటుకు గురైన జొమాటో డెలివరీ బాయ్ కు ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి రూ. 2 లక్షల ఆర్థిక సహాయం అందజేస్తామన్నారు.
గిగ్ కార్మికుల కోసం ఒక ప్రత్యేక యాప్ ను అందుబాటులోకి తీసుకొస్తామని చెప్పారు. సంక్షేమ బోర్డు తరహాలో ఒక బోర్డు ఏర్పాటు చేయాలని ప్లాన్ చేస్తున్నామన్నారు. రాజస్థాన్ కంటే మెరుగైన సేవలు అందించే విధంగా అందుబాటులోకి తీసుకొస్తామన్నారు. గిగ్ కార్మికుల రక్షణ, భద్రతపై దృష్టి సారించామన్నారు. ఆటో కార్మికుల సమస్యలను కూడా పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఆటో డ్రైవర్లకు అన్యాయం జరగకుండా చూస్తామన్నారు.
హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో స్విగ్గీ, జొమాటో డెలివరీ బాయ్‌లు, ఓలా, ఉబర్ సిబ్బందితో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు. తెలంగాణ వ్యాప్తంగా సుమారు మూడున్నర లక్షల మంది గిగ్ వర్కర్లు (ఆన్‌లైన్ యాప్‌లు, డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లపై తాత్కాలికంగా పని చేసే వాళ్లు) ఉన్న నేపథ్యంలో.. సీఎం రేవంత్ రెడ్డి వారితో భేటీ అయ్యారు.
రాహుల్ గాంధీ ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు ప్రత్యేకంగా గిగ్ వర్కర్లతో సమావేశమయ్యామని చెప్పారు ఏఐసీసీ ప్రొఫెషనల్ చైర్మన్ ప్రవీణ్ చక్రవర్తి. 2023, నవంబర్ 27లో రాహుల్ గాంధీ గిగ్ వర్కర్స్ తో సమావేశమయ్యారని తెలిపారు. సామాజిక భద్రత, ప్రమాద బీమా వర్తింపజేస్తామన్నారు. దేశవ్యాప్తంగా కోటి మంది వరకు గిగ్ వర్కర్స్ ఉన్నారని చెప్పారు.