వెలుగు ఓపెన్ పేజీ : ముమ్మాటికీ ఇది రాజకీయ కుట్ర!

వెలుగు ఓపెన్ పేజీ :  ముమ్మాటికీ ఇది రాజకీయ కుట్ర!

దేశంలో  నియోజకవర్గాల  పునర్విభజన  వివాదాస్పదమవుతోంది.  ఎందుకు?  ఉత్తర  దక్షిణాది రాష్ట్రాల మధ్య ఒక అసమంజసమైన, అన్యాయమైన  ప్రాతినిధ్య పెంపును కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదిస్తోంది.  దేశ ప్రయోజనాల కోసం జనాభా నియంత్రణలో గొప్ప ప్రగతి సాధించిన తెలంగాణ వంటి దక్షిణాది రాష్ట్రాలకు దేశ నిర్ణయాధికారంలో పాత్ర, ప్రమేయాన్ని తగ్గించే నిశ్శబ్ద కుట్ర ఇది.  అదే సమయంలో జనాభాను  నియంత్రించక,  జనాభా  అసాధారణ వృద్ధికి  కారణమైన ఉత్తరాది  రాష్ట్రాలకు ఎక్కువ  ప్రాతినిధ్యాన్ని పెంచడం ద్వారా తమ అధికారాన్ని సుస్థిరపరుచుకోవాలన్నది బీజేపీ నాయకత్వపు దురాలోచన.  తమకు పట్టులేని,  ఏ విధంగానూ తావు లభించని దక్షిణాదిపై రాజకీయంగా ఆధారపడే అవసరం లేకుండా చేసుకోవాలని రచిస్తున్న పన్నాగమిది.  పునర్విభజనను ఆసరాగా చేసుకొని జనాభా దామాషాలో  నియోజకవర్గాల సంఖ్య పెంచినా,  కాదని అన్ని రాష్ట్రాల్లో ఇప్పుడున్న స్థానాల సంఖ్యకు 50 శాతం పెంపు జరిపినా.... రెండిట్లో  ఏది జరిగినా దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం ఖాయం!


చట్ట సభల్లో  ప్రాతినిధ్యం,  పలు వేదికలపై స్వరం, నిధుల్లో వాటా... ఇలా అన్నీ తగ్గిపోతాయి. మంచి కోరి సత్ఫలితాలు సాధించినవారికి శిక్ష,  నిర్దేశించుకున్న ఫలితాలు సాధించక దేశానికి జనాభా  భారాన్ని పెంచినవారికి బహుమతి  ఇవ్వాలని  చూస్తోంది.  దీనికితోడు  మహిళా  రిజర్వేషన్  వర్తింపును  అనుకున్నదానికన్నా ముందుకు జరిపి,  చట్టాన్నీ, రాజ్యాంగాన్నీ అడ్డంగా సవరించాలని చూస్తోంది.  తద్వారా రానున్న ఎన్నికల్లో లబ్ధి పొందాలనే సంకుచిత  ధోరణితోనే  ఈ నెల మధ్యలో పార్లమెంటు ప్రత్యేక సమావేశాల ఆలోచన చేస్తోంది. తాజా ప్రతిపాదనలపై వస్తున్న నిర్దిష్ట ఆరోపణలకు సమాధానం ఇవ్వకుండా దేశ హోం మంత్రి అమిత్ షా,  ప్రధాని నరేంద్ర మోదీ ఇద్దరూ పచ్చి అబద్ధాలను ప్రచారం చేస్తున్నారు.  దక్షిణాదికి అన్యాయం జరగబోదని నిర్హేతుక వాదన వినిపించే యత్నం చేస్తున్నారు.

రాజీ మార్గం ఇదివరకున్నదే!

1952 నుంచి 2002 వరకు నాలుగుమార్లు  రాజ్యాంగ  సవరణలతో చట్టాల్ని ఏర్పరచి,  తద్వారా  పునర్విభజన కమిషన్లను నియమించారు.  ఆయా కమిషన్లు నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియ నిర్వహించాయి. పదేళ్లకు ఒకసారి జరిగే జనాభా లెక్కల ఆధారంగా నియోజకవర్గాల పునర్విభజన జరపాలన్నది  స్థూల నిర్ణయం. 1952 నుంచి జనాభా పెరుగుదలనుబట్టి  నియోజకవర్గాల సంఖ్యను పెంచుతూ,  దాని ప్రకారం నియోజకవర్గాల  భౌగోళిక స్వరూపాల్ని మారుస్తూ  వచ్చారు. కానీ, 1973లో ఏర్పడిన పునర్విభజన కమిషన్ ముందు ఒక సంక్లిష్టమైన  ప్రశ్న తలెత్తింది. జనాభాను బట్టి నియోజకవర్గాల  సంఖ్య పెంచడం వల్ల కొందరికి అనుచిత నష్టం, మరికొందరికి ఆయాచిత  లబ్ధి  కలుగుతున్నాయనేది నాటి వివాదం. ఫలితంగానే 1971 జనాభా లెక్కల ఆధారంగా లోక్‌‌సభ సభ్యుల సంఖ్యను 543కు పెంచి,  భౌగోళిక  స్వరూపాలను  ఖరారు చేశారు.  పదేళ్లకోసారి జనాభా లెక్కలు అందుబాటులోకి వచ్చినా,  ఇక  నియోజకవర్గాల సంఖ్యను 2000 సంవత్సరం వరకు మార్చకూడదని 1976లో (42వ రాజ్యాంగ సవరణ ద్వారా) నిర్ణయించారు. 2001 జనాభా లెక్కల ప్రకారం నియోజకవర్గాల సంఖ్య మార్పునకు అవకాశం ఉన్నప్పటికీ, 2026 తర్వాత అందుబాటులో ఉండే (2021 జనగణన అనే అంచనాతో) జనాభా లెక్కల ఆధారంగా సంఖ్య మార్పునకు  వెళ్లాలని 2002లో  మరోమారు నిర్ణయించారు. అందుకే, 2009లో  దేశవ్యాప్తంగా నియోజకవర్గాల పునర్విభజన జరిగినప్పటికీ,  సంఖ్య మార్పు జోలికి వెళ్లలేదు. 1976లో  ఖరారైన 543 సంఖ్యకే పరిమితమౌతూ తాజా (2001 జనాభా) లెక్కల ప్రకారం  నియోజకవర్గాల భౌతిక స్వరూపాల్ని ఏకరీతికి సర్దుబాటు చేశారు.

ప్రత్యామ్నాయం చూడాలి

 ‘జనాభా ప్రాతిపదికన నియోజకవర్గాల పెంపు వల్ల దక్షిణాదికి  సీట్లేం తగ్గవు’ అని లోగడ అమిత్ షా బహిరంగ ప్రకటన చేశారు. తాజాగా కేరళ ఎన్నికల ప్రచార సభలో ప్రధాని మోదీ మాట్లాడుతూ ‘ఇప్పుడున్న స్థానాలకు అదనంగా 50 శాతం పెంపువల్ల  దక్షిణాదికి సీట్లు తగ్గవు’ అని సందర్భం లేకుండా ఈ అంశాన్ని ప్రస్తావించారు.  ఇప్పుడున్న స్థానాలు తగ్గుతాయని ఎవరూ అనటం లేదు, రేపు జరగబోయే పెంపుదలలో  తక్కువ  ప్రాతినిధ్యం లభించి అన్యాయం జరగనుంది అన్నది దక్షిణాది రాష్ట్రాల వాదన.  అలా  జరగబోయేది  దాటవేస్తూ,  ‘తగ్గవు’ అనే ఒక సాంకేతిక మాటను ఉపయోగించి పబ్బం గడుపుకోవాలని ఈ ‘పెద్ద మనుషులు’ చూస్తున్నారు. ఉదాహరణకు 50 శాతం స్థానాల పెంపుతో  ప్రస్తుతం 80 లోక్‌‌సభ స్థానాలున్న ఉత్తర్‌‌ప్రదేశ్‌‌లో ఆ సంఖ్య 120కి చేరితే, 39 స్థానాలున్న తమిళనాడు లోక్‌‌సభ స్థానాల సంఖ్య 60కి చేరుతుంది. రెండు రాష్ట్రాల ప్రాతినిధ్యంలో ఉన్న వ్యత్యాసం ఇప్పటివరకున్న 41 నుంచి పునర్విభజన తర్వాత 60కి వెళుతుంది. అంటే,  జనాభా నియంత్రించినవారికి శిక్ష,  జనాభా వృద్ధికి  కారకులైనవారికి బహుమతికాక మరేమవుతుంది?

దక్షిణాదికి అన్యాయం జరగొద్దు

పుష్కర కాలంగా కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రతిపక్షాలు అధికారంలో ఉన్న రాష్ట్రాలకు అన్యాయం చేస్తూ వస్తోంది. ఈ వివక్ష నానాటికీ పెరుగుతోంది. పైగా బరితెగింపు మాటలకూ వెనుకాడటం లేదు. ‘డబుల్ ఇంజిన్ సర్కార్‌‌’ ఉంటే మంచిదని  ప్రతి ఎన్నికల్లో  ఓటర్లను  మభ్యపెడుతూ రాజ్యాంగ  నిబంధనలకు,  సమాఖ్యరాజ్య స్ఫూర్తికి  విరుద్ధంగా  వ్యవహరిస్తోంది.  ముఖ్యంగా దక్షిణాది  రాష్ట్రాలకు  నిధుల  కేటాయింపులో,  పన్నుల వాటా  పంపిణీలో,  పథకాల విస్తరణలో,  చివరకు ప్రాతినిధ్యం పెంపులో  కూడా తీరని అన్యాయం చేస్తోంది.  ఒక్క తెలంగాణనే  తీసుకుంటే  దేశంలో 2.8 శాతం జనాభా వాటా మాత్రమే కలిగి ఉన్నప్పటికీ, జీడీపీ (స్థూల జాతీయోత్పత్తి)కి 5 శాతం నుంచి 5.2 శాతం  వరకు తెలంగాణ సమకూరుస్తోంది. కానీ, అందుకు తగిన దామాషాలో నిధులు, పథకాలు,  కేంద్ర  సహకారం లభించడం లేదు. 

మహిళా రిజర్వేషన్లలోనూ తొండి ఆట 

మహిళల రిజర్వేషన్ విషయంలో అందరికన్నా తమకే ఎక్కువ  శ్రద్ధ ఉన్నట్టు  బీజేపీ  నాయకత్వం ఒక అపోహ  కలిగించే  ప్రయత్నం చేస్తోంది. 2023లో చట్టం తీసుకువచ్చేటప్పుడు కూడా  అమలుపై  స్పష్టత ఇవ్వకుండా 2024 సార్వత్రిక ఎన్నికల్లో లబ్ధి కోసమే ప్రయాసపడింది. స్పష్టత ఇవ్వండని కాంగ్రెస్ పట్టుబడితే 2026లో  అందుబాటులోకి వచ్చే తాజా జనాభా లెక్కల ఆధారంగా జరిపే నియోజకవర్గాల పునర్విభజన తర్వాతే మహిళా రిజర్వేషన్ అమలు అని చెప్పారు. 2021లో జరగాల్సిన  జనగణన కొవిడ్ మహమ్మారి వల్ల  సాధ్యపడక  2025లోనూ  మొదలుకాలేదు.  దాన్నిబట్టి 2034  సార్వత్రిక ఎన్నికల వరకు మహిళా  రిజర్వేషన్  అమలులేనట్టే అనే భావన కలిగించారు.

  జనగణన ఈ సంవత్సరం మొదలెట్టినా వచ్చే సంవత్సరం మే నెల వరకుగాని తాజా జనాభా లెక్కలు అందుబాటులోకి రావు. అప్పుడు నియోజకవర్గాల పునర్విభజన కమిషన్ ఏర్పరచి, పునర్విభజన పూర్తి చేసి రిజర్వేషన్లు అమలుచేయడం 2029 ఎన్నికల్లో సాధ్యపడకపోవచ్చు. అందుకని  2026 తర్వాత తాజా  జనాభా లెక్కలు,  తదనంతర  పునర్విభజన అన్న నిబంధనను తొలగించే  రాజ్యాంగ,  చట్ట సవరణలకు  ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం హడావుడి చేస్తోంది. అది కూడా 2029 సార్వత్రిక ఎన్నికల్లో, అంతకుముందు రానున్న రెండున్నరేళ్లలో జరగాల్సిన దాదాపు పది రాష్ట్రాల శాసనసభ ఎన్నికల్లో లబ్ధి కోసమే ఈ ఎత్తుగడ!  ఇదంతా రాజకీయ కుట్ర కాక మరేమవుతుంది?.

 దేశవ్యాప్తంగా చర్చ జరగాలి

జనాభా  నియంత్రించినవారికి  ఇది శిక్ష అనితెలంగాణ  సీఎం రేవంత్‌‌రెడ్డితోపాటు  కర్నాటక  సీఎం సిద్దరామయ్య,   ఏపీ  సీఎం చంద్రబాబు నాయుడు,  తమిళనాడు సీఎం స్టాలిన్,  కేరళ సీఎం విజయన్ తదితరులు ఇదివరకే  తీవ్రంగా ఖండించారు. ప్రాతినిధ్యం విషయంలో  ప్రపంచవ్యాప్తంగా పలు  ప్రజాస్వామ్య  దేశాల్లో వివిధ పద్ధతులు అనుసరిస్తున్నారు.  రాజ్యాంగ నిపుణులు,  పాలనానుభవం కలిగిన మేధావులతో  సమాలోచనలు జరిపి,  మరేదైనా ప్రత్యామ్నాయం ఆలోచించాలి తప్ప తొందరపాటు చర్య  సరికాదు.  సంఖ్య పెంపునకు  తొందరపడకుండా, శాస్త్రీయంగా సమంజసమైన రీతిలో నియోజకవర్గాల పెంపునకు ప్రత్యామ్నాయాలు ఆలోచించాలి. దేశవ్యాప్తంగా దీనిపై చర్చ జరగాలి.  అవసరమైతే   అప్పటివరకు, 2002లో నిర్ణయించినట్టు గానే  ప్రస్తుతానికి సంఖ్య పెంపునకు వెళ్లకుండా, తాజా జనాభా లెక్కల ఆధారంగా నియోజకవర్గాల భౌతిక స్వరూపాలని ఏకరీతి సర్దుబాటు చేసే పునర్విభజన చర్యలతో (2009లో లాగ) సరిపెట్టడమా అన్నది కూడా ఆలోచించాలి. 

- పొన్నం ప్రభాకర్
రవాణా, బీసీ సంక్షేమ శాఖల మంత్రి 

ఓపెన్​ పేజీకి వ్యాసాలు, లెటర్లు పంపాల్సిన మెయిల్​ ఐడీ
openpage@v6velugu.com
రచయితలు ‘వెలుగు’ కు మాత్రమే పంపుతున్నామని 
హామీ తప్పనిసరి రాయాలి. స్వీయ రచన అయి ఉండాలి.
రచన 700 పదాలకు మించరాదు.