కేంద్రంలో కాంగ్రెస్​ ఉంటే రాష్ట్రానికి అధిక నిధులు : పొన్నం ప్రభాకర్​ గౌడ్​

కేంద్రంలో కాంగ్రెస్​ ఉంటే రాష్ట్రానికి అధిక నిధులు : పొన్నం ప్రభాకర్​ గౌడ్​
  • కేంద్రంలో బీజేపీని గద్దె దించి.. కాంగ్రెస్​ను తెచ్చుకుందాం
  • రాముడి పేరిట రాజకీయం చేస్తున్న బీజేపీని శిక్షించాలని ప్రజలకు పిలుపు

హైదరాబాద్, వెలుగు: కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే రాష్ట్ర అభివృద్ధికి అధికంగా నిధులు తెచ్చుకోవచ్చని మంత్రి పొన్నం ప్రభాకర్​ గౌడ్​ అన్నారు. రాష్ట్రంలో బీఆర్‌‌‌‌‌‌ఎస్‌‌ను దించి కాంగ్రెస్‌‌ను తెచ్చుకునేందుకు కృషి చేసినట్టే.. దేశంలో బీజేపీని దించి కాంగ్రెస్‌‌ను తెచ్చుకోవడానికి కష్టపడాలని పార్టీ నాయకులు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు. తుక్కుగూడ జనజాతర సభలో ఆయన మాట్లాడుతూ.. బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు రెండూ ఒక్కటేనని ఆరోపించారు. 

అభివృద్ధి చేయకుండా కేవలం రాముడి పేరిట రాజకీయం చేస్తున్న బీజేపీని శిక్షించాలని ప్రజలను కోరారు. అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలన్నింటినీ తాము అమలు చేస్తున్నామని తెలిపారు. ఆరోగ్యశ్రీ లిమిట్‌‌ను రూ.5 లక్షల నుంచి 10 లక్షలకు పెంచామని, మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించామని, 200 యూనిట్ల లోపు ఉచిత విద్యుత్​ ఇస్తున్నామని, రూ.500కే గ్యాస్ సిలిండర్ అందిస్తున్నామని వివరించారు. ఎన్నికల తర్వాత కొత్త రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్లు ఇస్తామని చెప్పారు. 

అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన కేసీఆర్..శాసనసభకు రాకుండా.. కుంగిన కాళేశ్వరం ప్రాజెక్టుపై జవాబు చెప్పకుండా తప్పించుకుని తిరుగుతున్నాడని దుయ్యబట్టారు. ఇప్పుడు  ప్రజలను మభ్యపెట్టి, ఓట్లు దండుకునేందుకు బయటకెళ్తున్నాడని అన్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పొన్నం సూచించారు. కేసీఆర్ పాలనలో కాంగ్రెస్ నాయకులను రోడ్ల మీదకు రానియ్యకుండా అరెస్టులు చేయించాడని, కానీ, తమ ప్రజా పాలన ప్రభుత్వం కేసీఆర్‌‌‌‌కు స్వేచ్ఛగా తిరిగేందుకు అవకాశం ఇస్తున్నదని చెప్పారు. ఆ అవకాశాన్ని నోటికొచ్చినట్టు మాట్లాడి దుర్వినియోగం చేయొద్దని, ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడాలని పొన్నం హెచ్చరించారు.