హైదరాబాద్లో 80 కొత్త ఆర్టీసీ బస్సులు.. ప్రారంభించనున్న మంత్రి పొన్నం

హైదరాబాద్లో 80 కొత్త ఆర్టీసీ బస్సులు..  ప్రారంభించనున్న మంత్రి పొన్నం

హైదరాబాద్, వెలుగు:  ఆర్టీసీలో  కొత్తగా 80 బస్సులు అందుబాటులోకి రానున్నాయి. శనివారం ఈ బస్సులను  ట్రాన్స్ పోర్ట్ మినిస్టర్  పొన్నం ప్రభాకర్, రవాణా శాఖ  సెక్రటరీ శ్రీనివాసరాజు, ఆర్టీసీ ఎండీ సజ్జనార్  ప్రారంభించనున్నారు. హైదరాబాద్, నెక్లెస్ రోడ్ సమీపంలోని బీఆర్ అంబేద్కర్ విగ్రహం దగ్గర ఓపెనింగ్ కార్యక్రమం నిర్వహించనున్నారు. 80 కొత్త బస్సుల్లో  30 ఎక్స్ ప్రెస్, 30 రాజధాని ఏసీ, 20 లహరి స్లీపర్ కమ్ సీటర్(నాన్ ఏసీ) బస్సులున్నాయి. 

మహిళలకు ఫ్రీ జర్నీ స్కీమ్‌‌‌‌‌‌‌‌ వల్ల పెరిగిన రద్దీతో  కొత్త బస్సులను తీసుకొచ్చినట్లు  ఆర్టీసీ ఒక ప్రకటనలో వెల్లడించింది.  ఈ  ఫైనాన్సియల్ ఇయర్లో  రూ.400 కోట్లతో 1,050 కొత్త బస్సులను కొనుగోలు చేయాలని ఆర్టీసీ ఇప్పటికే  నిర్ణయించింది. వాటిలో 400 ఎక్స్ ప్రెస్, 512 పల్లె వెలుగు, 92 లహరి స్లీపర్ కమ్ సీటర్, 56 ఏసీ రాజధాని బస్సులున్నాయి. వీటికి తోడు పర్యావరణ హితమైన ఎలక్ట్రిక్ వాహనాలను హైదరాబాద్ సిటీలో 540,  ఇతర ప్రాంతాల్లో 500 బస్సులను వాడకంలోకి తేనున్నట్లు ఆర్టీసీ తెలిపింది. విడతల వారీగా 2024  మార్చి నాటికి కొత్త బస్సులన్ని ప్రయాణికులకు అందుబాటులోకి తీసుకువచ్చేలా సంస్థ ప్లాన్ చేసింది.

3 నుంచి ఆర్టీసీ వనభోజనాలు

వచ్చే నెల 3 నుంచి 10 వ తేదీ వరకు  రెండు దశల్లో వన భోజనాలు నిర్వహించాలని ఆర్టీసీ నిర్ణయించింది. ఈ కార్యక్రమంలో  ఆర్టీసీ కార్మికులు, ఉద్యోగులందరూ పాల్గొనేలా చూడాలని అన్ని డిపోల మేనేజర్లకు ఎండీ సజ్జనార్ శుక్రవారం  ఆదేశాలు జారీ చేశారు. ఖర్చులను ఆర్టీసీనే భరిస్తుందని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. గత రెండేండ్లుగా ఆర్టీసీ కార్మికులు, ఉద్యోగులు ఎంతో కష్టపడుతున్నారని  ఇలాంటి కార్యక్రమాల వల్ల వారికి రిలీఫ్ దొరుకుతుందని చెప్పారు. దీని వల్ల వారి పనితీరు మెరుగుపడుతుందని ఎండీ ఆశాభావం వ్యక్తం చేశారు.