ఎలక్టోరల్ బాండ్లంటేనే క్విడ్ ప్రోకో.. మంత్రి పొన్నం ప్రభాకర్ సంచలన వ్యాఖ్యలు

ఎలక్టోరల్ బాండ్లంటేనే  క్విడ్ ప్రోకో.. మంత్రి పొన్నం ప్రభాకర్ సంచలన వ్యాఖ్యలు

హైదరాబాద్: ఎలక్టోరల్ బాండ్లపై మంత్రి పొన్నం ప్రభాకర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీ పారిశ్రామిక వేత్తల నుంచి నల్లడబ్బును బాండ్ల రూపంలో సేకరించి రాజకీయ లబ్ధి కోసం వినియోగించుకుంటోందని అన్నారు. ఎలక్టోరల్ బాండ్లంటేనే క్విడ్ ప్రోకో అని అభిప్రాయపడ్డారు.  హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండలం పెంచికలపేట గ్రామంలో శ్రీరామ నవమి వేడుకల్లో మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మాట్లాడుతూ రాముడి లాంటి పాలన దక్షత తమ ప్రభుత్వానికి ఇవ్వాలని శ్రీరామున్ని కోరుకున్నట్లు వెల్లడించారు. రాజకీయ పార్టీలు బాండ్ల రూపంలో విరాళాలు సేకరించవచ్చునని ప్రధాని మోదీ స్వయంగా తెలపడాన్ని మంత్రి తప్పుబట్టారు. 

ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో శరత్ చంద్రా రెడ్డి నుంచి రూ.  50 కోట్లను విరాళంగా స్వీకరించిందని, ఆ వెంటనే ఆయనకు బెయిల్ వచ్చిందని తెలిపారు.  మరొక వ్యక్తికి రూ.100 కోట్లు ఇవ్వడం వల్ల ఆయనకు కాంట్రాక్టు వచ్చిందని అన్నారు. బీజేపీ వేల కోట్ల రూపాయలు రాజకీయ లబ్ధి కోసం సేకరించిందని, దీనిపై సుప్రీం కోర్టు మొట్టికాయలు వేసి బాగోతం బయటపెట్టిందన్నారు.  నల్ల డబ్బు ఉన్నోడిపై చర్యలు తీసుకోవాల్సింది పోయి బాండ్ల రూపంలో సేకరించడం ఏంటని ప్రశ్నించారు. ‘నల్ల డబ్బు మీ దగ్గరికి వస్తే తెల్లగా అవుతుందా..?’ అని కమలం పార్టీ అగ్ర నాయకులను ప్రశ్నించారు. ఈ ఘటనను చూస్తే ప్రధాని నల్ల ధనాన్ని ఏ విధంగా ప్రోత్సహిస్తున్నారో అర్థం చేసుకోవచ్చన్నారు.