
- కంటోన్మెంట్ పెండింగ్ యూజర్ చార్జీలు విడుదల చేయాలని రిక్వెస్ట్
హైదరాబాద్, వెలుగు: రోడ్ల విస్తరణ, ఇతరత్రా మౌలిక వసతుల కోసం జీఎంహెచ్‌సీ పరిధిలో ఉన్న రక్షణ శాఖ భూములను బదలాయించాలని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ను హైదరాబాద్ఇన్చార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ విజ్ఞప్తి చేశారు. శుక్రవారం హెచ్ఐసీసీలో ఏర్పాటుచేసిన జీటో కనెక్ట్ ఎగ్జిబిషన్‌ను ప్రారంభించడానికి హైదరాబాద్చేరుకున్న రాజ్‌నాథ్‌సింగ్‌కు బేగంపేట ఎయిర్‌పోర్ట్‌లో మంత్రి పొన్నం ప్రభాకర్ స్వాగతం పలికారు.
ఈ సందర్భంగా రక్షణ శాఖ భూముల విషయమై జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి, రాజ్యసభ సభ్యుడు అనిల్ కుమార్ యాదవ్, సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేశ్ సంతకాలతో కూడిన వినతిపత్రాన్ని కేంద్ర మంత్రికి అందజేశారు.
రోజురోజుకూ అభివృద్ధి చెందుతున్న హైదరాబాద్, సికింద్రాబాద్‌లో రోడ్ల విస్తరణ, ఇతరత్రా మౌలిక వసతుల కల్పనకు రక్షణ శాఖ భూములను వెంటనే బదలాయించాలన్నారు. ప్రజా వినియోగం కోసం ఇప్పటికే కొన్ని రక్షణ శాఖ భూములను ఇవ్వడానికి అంగీకరించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. మిగిలిన భూములను అప్పగించే ప్రక్రియను వేగవంతం చేయాలని కోరారు.
కంటోన్మెంట్ ఎన్నికలు జరపాలి..
సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు ఎన్నికలు వీలైనంత త్వరగా నిర్వహించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని రాజ్‌నాథ్‌సింగ్‌ను మంత్రి పొన్నం ప్రభాకర్ కోరారు. కంటోన్మెంట్ నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి యూజర్ చార్జీల విభాగం కింద అందించే సుమారు రూ.వెయ్యి కోట్లు పెండింగ్‌లో ఉన్నాయని కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లారు.
ఆ బకాయిలను సకాలంలో విడుదల చేయడం వల్ల రక్షణ శాఖ పరిధిలో అభివృద్ధి చెందుతున్న ప్రాంతాల్లో ప్రజలకు మౌలిక సదుపాయాలు కల్పించడం, అవసరమైన పౌర సేవలు కొనసాగించడంలాంటి పనులకు రాష్ట్ర ప్రభుత్వానికి తగినంత స్వేచ్ఛ లభిస్తుందని వివరించారు. హైదరాబాద్ అభివృద్ధికి కీలకమైన ఈ అంశాలపై రక్షణ మంత్రిత్వ శాఖ త్వరలోనే తగిన నిర్ణయం తీసుకుంటుందని విశ్వసిస్తున్నట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు.