గౌరవెల్లి నీళ్ల కోసం కొట్లాడుతుంటే..బీఆర్ఎస్ ​ఎమ్మెల్యేలు ఎదురుదాడి చేస్తున్రు: పొన్నం

గౌరవెల్లి నీళ్ల కోసం కొట్లాడుతుంటే..బీఆర్ఎస్ ​ఎమ్మెల్యేలు ఎదురుదాడి చేస్తున్రు: పొన్నం

హుస్నాబాద్​, వెలుగు : గౌరవెల్లి ప్రాజెక్టును పూర్తిచేసి రైతులకు నీళ్లు రావాలని అసెంబ్లీలో చర్చిస్తుంటే బీఆర్ఎస్​ ఎమ్మెల్యేలు తనపై ఎదురుదాడికి దిగుతున్నారని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖల మంత్రి పొన్నం ప్రభాకర్​ అన్నారు. గురువారం ఆయన సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లో జరిగిన సంత్ సేవాలాల్ జయంతి సభలో పాల్గొని మాట్లాడారు. కాంగ్రెస్​ హయాంలోనే ముప్పావు వంతు పూర్తయిన గౌరవెల్లి ప్రాజెక్టును బీఆర్ఎస్​ పదేండ్ల పాలనలో పావలా వంతు కూడా పూర్తిచేయలేకపోయిందన్నారు. పంటలకు నీళ్లిచ్చేందుకు డిస్ట్రిబ్యూటరీ కెనాల్స్​ను నిర్మించకుండా ప్రజలను మోసం చేసిందన్నారు. 

తనను ఇక్కడి ప్రజలు గెలిపిస్తే, వాళ్ల సమస్యల పరిష్కారం కోసం అసెంబ్లీలో అడుగుతుంటే బీఆర్ఎస్​ ఎమ్మెల్యేలు తనపైనే ఎదురుదాడి చేస్తున్నారని విమర్శించారు. వాళ్లు భయపెడితే తాను భయపడబోనన్నారు. వాళ్లకు తానేమీ పాలేరును కాదన్నారు. త్వరలోనే గౌరవెల్లి ప్రాజెక్టు నుంచి నీళ్లు ఇచ్చేందుకు కాల్వలు తవ్వుతామన్నారు. ఎస్టీ రిజర్వుడ్​నియోజకవర్గాల కంటే హుస్నాబాద్ నియోజకవర్గంలో గిరిజనులను అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు. రోడ్లు, కరెంట్, నీళ్ల సౌలత్ కల్పించి సమస్యలు లేని తండాలుగా తీర్చిదిద్దేందుకు కృషిచేస్తానన్నారు. హుస్నాబాద్, అక్కన్నపేట ఎంపీపీలు లకావత్ మానస, మాలోతు లక్ష్మి, అక్కన్నపేట జడ్పీటీసీ భూక్య మంగ పాల్గొన్నారు.