ఫోన్‌‌ ట్యాపింగ్‌‌ కేసులో కక్షపూరిత చర్యల్లేవు : మంత్రి పొన్నం

ఫోన్‌‌ ట్యాపింగ్‌‌ కేసులో కక్షపూరిత చర్యల్లేవు  : మంత్రి పొన్నం
  • మేడారం జాతర కోసం నాలుగు వేల ఆర్టీసీ బస్సులు
  • బస్సులు గద్దెల వరకూ వెళ్తాయి : మంత్రి పొన్నం  

కరీంనగర్, వెలుగు : ఫోన్‌‌ ట్యాపింగ్‌‌ కేసులో ప్రభుత్వం ఎవరిపైనా కక్షపూరితంగా వ్యవహరించడం లేదని, చట్టం తన పని తాను చేసుకుపోతుందని రాష్ట్ర బీసీ సంక్షేమం, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌‌ చెప్పారు. రథసప్తమి సందర్భంగా కరీంనగర్‌‌లోని మార్కెట్ శ్రీవేంకటేశ్వర స్వామి ఆలయంలో ఆదివారం ప్రత్యేక పూజలు చేసి, సూర్యప్రభ వాహనసేవలో పాల్గొన్నారు. 

అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడుతూ.. మేడారం సమ్మక్క, సారలమ్మ జాతర కోసం రవాణా శాఖ తరఫున అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. ఉత్తర తెలంగాణలోని కరీంనగర్, వరంగల్, నిజామాబాద్, ఆదిలాబాద్ రీజియన్లలోని 51 కేంద్రాల నుంచి మేడారానికి 4 వేల ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్లు తెలిపారు. ఈ బస్సులు గద్దెల వరకు వెళ్తాయన్నారు. మున్సిపల్ ఎన్నికల రిజర్వేషన్లపై ప్రభుత్వం, ప్రజాప్రతినిధులు ప్రమేయం ఉండదని చెప్పారు. 

కాంగ్రెస్ క్యాండిడేట్ల ఎంపిక పారదర్శకంగా జరుగుతుందన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో అందరూ సమన్వయంతో పని చేయాలని సూచించారు. ఆయన వెంట సుడా చైర్మన్‌‌ కోమటిరెడ్డి నరేందర్‌‌రెడ్డి, కరీంనగర్‌‌ కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్‌‌చార్జి వెలిచాల రాజేందర్‌‌రావు, మున్సిపల్‌‌ కమిషనర్‌‌ ప్రఫుల్‌‌ దేశాయ్‌‌, కరీంనగర్‌‌ పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు అంజన్‌‌కుమార్‌‌, అర్బన్‌‌ బ్యాంక్‌‌ చైర్మన్‌‌ కర్ర రాజశేఖర్‌‌  పాల్గొన్నారు.