వరద ఉధృతి తగ్గాలని మంత్రి పువ్వాడ పూజలు

వరద ఉధృతి తగ్గాలని మంత్రి పువ్వాడ పూజలు

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా: వరద తగ్గాలని, గోదారమ్మ శాంతించాలని  కోరుతూ రాష్ట్ర మంత్రి పువ్వాడ అజయ్ భద్రాచలంలోని గోదావరి నది స్నానఘట్టాల వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేద పండితులు, అర్చకుల మంత్రాల నడుమ మంత్రి పువ్వాడ గోదావరి నదిలో పూలు చల్లి... హారతి అర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ... భద్రాచలంలో ఎన్నడూ లేని విధంగా భద్రాచలం పట్టణాన్ని వరదలు ముంచెత్తాయని తెలిపారు. వరదల నుంచి కాపాడటానికి  ప్రభుత్వం అన్ని విధాల కృషి చేస్తోందన్న మంత్రి...   ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు. ముఖ్యంగా లోతట్టు ప్రాంతాల ప్రజలు అలెర్ట్ గా ఉండాలని హెచ్చిరించారు. ఐటీడీఏ పీవో గౌతం, భద్రాద్రి ఆలయ  ఈవో  శివాజీ, అధికారులు, వేద పండితులు, అర్చకులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. 

ఇక...  కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలకు  భద్రాచలంలో 30 ఏళ్లలో ఎప్పుడు లేనంతగా గోదావరి నీటిమట్టం పెరిగింది. భద్రాచలం టౌన్ తో పాటు చుట్ట పక్కల ప్రాంతాలు ఇంకా వరద నీటిలోనే ఉన్నాయి. భద్రాచలం నుంచి వెళ్లే అన్ని మార్గాలను గోదావరి చుట్టుముట్టింది. వరద ప్రభావంతో చర్ల, దుమ్ముగూడెం, అశ్వాపురం, బూర్గంపాడు, మణుగూరు, పినపాక మండలాల్లో వందకు పైగా గ్రామాల్లో రాకపోకలు నిలిచిపోయాయి. అధికారులు విద్యుత్ సరఫరాను నిలిపివేశారు. భద్రాచలం, బూర్గంపాడు మండలాల మధ్యనున్న బ్రిడ్జ్ పై  రాకపోకలను పూర్తిగా నిలిచిపోయాయి.