
- మంత్రి దామోదర రాజనర్సింహ విజ్ఞప్తి
హైదరాబాద్, వెలుగు: తెలంగాణను డ్రగ్స్ రహిత రాష్ట్రంగా మార్చడమే ప్రభుత్వ లక్ష్యమని ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ స్పష్టం చేశారు. ఈ లక్ష్య సాధనలో ప్రజల భాగస్వామ్యం అత్యంత కీలకమని, డ్రగ్స్ నిర్మూలనకు ప్రజలు కూడా సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. డ్రగ్స్ నిర్మూలనపై పోలీసు, ఆరోగ్య శాఖ అధికారులతో శుక్రవారం సెక్రటేరియెట్ లో మంత్రి సమీక్ష నిర్వహించారు.
ఆయన మాట్లాడుతూ.. అన్ని విద్యా సంస్థల్లో యాంటీ నార్కోటిక్స్ వింగ్స్ ఏర్పాటు చేయాలన్నారు. ఎర్రగడ్డలోని ఇన్ స్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ ప్రాంగణంలో అత్యాధునిక వసతులతో డీఅడిక్షన్ సెంటర్ ను అందుబాటులోకి తీసుకొస్తామని, అవసరాన్నిబట్టి మరిన్ని సెంటర్లు ఏర్పాటు చేస్తామని తెలిపారు.