నియోజకవర్గానికి 500మంది దళిత బంధు లబ్ధిదారుల ఎంపిక

నియోజకవర్గానికి 500మంది దళిత బంధు లబ్ధిదారుల ఎంపిక

దేశంలోనే దళిత బంధు పథకం ఆదర్శంగా నిలిచిందని  మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. పైలట్ ప్రాజెక్ట్ గా హుజురాబాద్ లో ప్రారంభించామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా గతంలో ప్రతి నియోజకవర్గంలో 100మందిని ఎంపిక చేసి వారికి దళిత బంధు పథకం నగదును అందించామన్నారు. మరోసారి ప్రతి నియోజకవర్గంలోనూ 1500 యూనిట్లు ద్వారా దళిత బంధు అందించాలని సీఎం కేసీఆర్ అదేశించారన్నారు. ఈ నెలాఖరులోగా నియోజకవర్గానికి 500మంది లబ్దిదారుల ఎంపిక పూర్తి చేయాలని సబితా ఇంద్రా రెడ్డి సూచించారు. రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ లో ఎమ్మెల్యేలు మంచిరెడ్డి కిషన్ రెడ్డి, సుధీర్ రెడ్డి, అరికేపూడి గాంధీ, జైపాల్ యాదవ్, యాదయ్య, అంజయ్య యాదవ్, ప్రకాష్ గౌడ్, కలెక్టర్ అమోయ్ కుమార్, అధికారులతో మంత్రి సబితా ఇంద్రా రెడ్డి సమీక్షా సమావేశం నిర్వహించారు.

దళిత బంధు లబ్దిదారుల ఎంపిక పారదర్శకంగా జరుగుతుందని మంత్రి సబితా ఇంద్రారెడ్డి చెప్పారు. ఎక్కడా అవినీతి తావులేకుండా ఎంపిక జరుగుతోందన్నారు. ఎమ్మెల్యేలు, అధికారులు సమావేశాలు ఏర్పాటు చేసి, లబ్ధిదారులకు అవగాహన కల్పిస్తున్నారని చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా 38,500 మందిని ఇప్పటికే ఎంపిక చేశామన్నారు.