బడుల్లో బ్రేక్ ఫాస్ట్ మెనూ రెడీ చేయండి : మంత్రి సబిత

బడుల్లో బ్రేక్ ఫాస్ట్ మెనూ రెడీ చేయండి : మంత్రి సబిత

హైదరాబాద్, వెలుగు : రాష్ట్రంలో దసరా నుంచి ప్రారంభంకానున్న చీఫ్ మినిస్టర్ బ్రేక్ ఫాస్ట్ స్కీమ్’కు మెనూను  రెడీ చేయాలని అధికారులను  విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి ఆదేశించారు. స్కీమ్ అమలును పర్యవేక్షించే బాధ్యతను అదనపు కలెక్టర్లకు అప్పగించనున్నట్లు చెప్పారు. మంగళవారం సెక్రటేరియేట్ లో సీఎంవో సెక్రటరీ స్మితా సబర్వాల్, విద్యాశాఖ సెక్రటరీ వాకాటి కరుణతో  కలిసి ఆమె రివ్యూ మీటింగ్ నిర్వహించారు. రాష్ట్రవ్యాప్తంగా ఒకటి నుంచి టెన్త్ వరకు 27,147 సర్కారు బడులు ఉన్నాయని మంత్రి తెలిపారు. వాటిలో  చదువుతున్న సుమారు 23 లక్షల మందికి బ్రేక్ ఫాస్ట్  స్కీమ్ ద్వారా లబ్ది చేకూరనుందని వెల్లడించారు. 

బడుల్లో బ్రేక్ ఫాస్ట్ అమలు చేస్తున్న దేశంలోని రెండో రాష్ట్రంగా తెలంగాణ నిలిచిపోతుందని చెప్పారు. ఇప్పటికే  మిడ్ డే మీల్స్ స్కీమ్ ద్వారా స్టూడెంట్లకు సన్నబియ్యాన్ని, గుడ్లు పంపిణీ చేస్తున్నామని తెలిపారు. పేద కుటుంబాలకు చెందిన స్టూడెంట్లకు పౌష్టికాహారం అందించడంతో పాటు వారికి చదువు పట్ల ఏకాగ్రతను పెంచే దిశగా రాష్ట్ర ప్రభుత్వం అన్నిచర్యలు తీసుకుంటున్నదన్నారు. స్కీమ్​ల్లో  ఎలాంటి లోపాలు తలెత్తకుండా చూడాలని అధికారులకు ఆదేశించారు.  సమావేశంలో స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ శ్రీదేవసేన, అడిషనల్ డైరెక్టర్ లింగయ్య, సమగ్ర శిక్ష ఏఎస్​పీడీ రమేశ్ తదితరులు పాల్గొన్నారు.