
బడంగ్ పేట్, వెలుగు : మీర్‌పేట కార్పొరేషన్‌లో అడ్డగోలుగా ఇంటి పన్నులు, నల్లా బిల్లులను వసూలు చేస్తున్నారని బీజేపీ అధికారంలోకి రాగానే వెంటనే తగ్గిస్తామని ఆ పార్టీ మహేశ్వరం అభ్యర్థి అందెల శ్రీరాములు యాదవ్ హామీ ఇచ్చారు. సోమవారం గాయత్రినగర్ శ్రీరామ ఆలయం నుంచి జిల్లెలగూడ వరకు ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీరాములు యాదవ్ మాట్లాడుతూ.. మంత్రి సబితమ్మకు శిలాఫలకాలపై ఉన్న ప్రేమ- ప్రజలపై లేదన్నారు.
గల్లీ గల్లీకో బెల్డ్ షాపు, విచ్చలవిడిగా గంజాయి అమ్మకాలు జరుగుతున్నా ఎక్సైజ్, పోలీస్ శాఖలు నిద్రపోతున్నాయని మండిపడ్డారు. గతంలో ఓ యువకుడు కత్తిపోట్లకు గురై చనిపోతే ఆ కుటుంబాన్ని ఇప్పటివరకు మంత్రి సబిత ఆదుకోలేదని మండిపడ్డారు.
మీర్‌పేట్ కార్పొరేషన్ అధ్యక్షుడు పెండ్యాల నర్సింహ, సిద్దాల దశరథ్, స్థానిక కార్పొరేటర్లు మద్ది సబితా రాజశేఖర్ రెడ్డి, అమర్ నాథ్ రెడ్డి, కీసర కృష్ణారెడ్డి, హరినాథ్ రెడ్డి, పద్మా నర్సింహ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.