‘మన ఊరు–మన బడి’పై మంత్రి సబిత సమీక్ష

‘మన ఊరు–మన బడి’పై మంత్రి సబిత సమీక్ష

మన ఊరు,మన బడి మొదటి విడత పనుల కింద ఈ నెలాఖరు వరకు 1400 స్కూళ్లలో పనులు పూర్తవుతాయని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. సైఫాబాద్ లోని డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ లో మన ఊరు, మన బడి కార్యక్రమం అమలు తీరుపై జిల్లా కలెక్టర్లతో మంత్రి సబితా ఇంద్రారెడ్డి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. సమావేశం ముగిసిన అనంతరం మంత్రి సబితా ఇంద్రారెడ్డి మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించిన 12 రకాల పనులు అన్ని స్కూళ్లలో జరుగుతున్నాయన్నారు.

త్వరలో అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి తీసుకెళ్తామని.. స్థానిక శాసనసభ్యులతో స్కూల్స్ ప్రారంభోత్సవ కార్యక్రమాలు చేస్తామని మంత్రి తెలిపారు. ఇందుకోసం పనులను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్లుకు ఆదేశించామని తెలిపారు. కలెక్టర్లు కూడా మన ఊరు,మనబడి కార్యక్రమం అమలుపై ప్రత్యేక దృష్టి పెట్టారని వెల్లడించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ లో మంత్రి సబితా ఇంద్రారెడ్డితో పాటు విద్యా శాఖ సెక్రెటరీ వాకాటి కరుణ, స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ దేవసేన, రాష్ట్ర విద్యా మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ ఛైర్మన్‌ శ్రీధర్ రెడ్డి, పలువురు అధికారులు పాల్గొన్నారు.