కుమ్మెర ఘటనపై హెచ్ఆర్సీకివిశారదన్ మహారాజ్ ఫిర్యాదు    

కుమ్మెర ఘటనపై హెచ్ఆర్సీకివిశారదన్ మహారాజ్ ఫిర్యాదు    
  • ఈ నెల 24లోగా నివేదిక ఇవ్వాలని రాష్ట్ర డీజీపీకి హెచ్‌‌ఆర్సీ ఆదేశం

బషీర్‌‌బాగ్, వెలుగు: నాగర్‌‌కర్నూల్ జిల్లా కుమ్మెర గ్రామంలో రెండు నెలల చిన్నారి మృతి ఘటనపై ధర్మ సమాజ్ పార్టీ అధ్యక్షుడు, బీసీ-ఎస్సీ-ఎస్టీ జేఏసీ చైర్మన్ డా. విశారదన్ మహారాజ్, బీసీ పొలిటికల్ ఫ్రంట్ చైర్మన్ బాలరాజ్ గౌడ్​లు చిన్నారి తల్లిదండ్రులు గణేశ్, మౌనికలతో కలిసి గురువారం రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ చైర్మన్ జస్టిస్ షమీమ్ అక్తర్‌‌కు ఫిర్యాదు చేశారు.

చిన్నారి మృతికి కారణమైన వారిపై హత్య కేసు నమోదు చేయలేదని, ఇప్పటివరకు వారిని అరెస్ట్ చేయలేదని కమిషన్ దృష్టికి తీసుకెళ్లారు. నాగర్‌‌కర్నూల్ జిల్లా పోలీసులు న్యాయం చేయడం లేదని, రాష్ట్ర డీజీపీని కలిసినా స్పందించలేదని పేర్కొన్నారు. ప్రభుత్వం నుంచి ఎలాంటి చేయూత అందలేదని, హెచ్​ఆర్సీ నుంచి అయినా న్యాయం జరిగేలా చూడాలని కోరారు. ఫిర్యాదును స్వీకరించిన హెచ్‌‌ఆర్‌‌సీ, చిన్నారి మృతికి గల కారణాలను ఈ నెల 24లోగా సమర్పించాలని రాష్ట్ర డీజీపీకి ఆదేశాలు జారీ చేసింది.