పేదల ఇండ్లను కూల్చితే చూస్తూ ఊరుకోం..రూ.లక్షన్నర కోట్ల అవినీతి కోసమే  మూసీ డెవలప్‌‌ మెంట్ డ్రామా 

పేదల ఇండ్లను కూల్చితే చూస్తూ ఊరుకోం..రూ.లక్షన్నర కోట్ల అవినీతి కోసమే  మూసీ డెవలప్‌‌ మెంట్ డ్రామా 
  • అవసరమైతే బుల్డోజర్లకు అడ్డుగా నిలబడ్తం
  • మూసీ ప్రాజెక్ట్‌‌ పేరిట లక్షన్నర మంది పేదల ఇండ్లను కూల్చివేసేందుకు కుట్ర 
  • నాగోల్ ఎస్టీపీ ప్లాంట్‌‌ను సందర్శించిన బీఆర్ఎస్..వర్కింగ్ ప్రెసిడెంట్​ కేటీఆర్

ఎల్బీనగర్, వెలుగు : మూసీ అభివృద్ధి పేరుతో పేదల ఇండ్లను కూల్చివేయడం సరికాదని, విధ్వంసం లేకుండా కూడా అభివృద్ధి చేయొచ్చని బీఆర్ఎస్ వర్కింగ్‌‌ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. బీఆర్ఎస్ హయాంలో నాగోల్, ఫతుల్లాగూడలో ఏర్పాటు చేసిన ఎస్టీపీ ప్లాంట్‌‌తో పాటు మూసీ వెంట నిర్మించిన వాకింగ్ ట్రాక్‌‌ను మాజీమంత్రులు సబితా ఇంద్రారెడ్డి, మల్లారెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, మహమూద్ అలీతో కలిసి కేటీఆర్‌‌‌‌ పరిశీలించారు.

ఈ సందర్భంగా నాగోల్‌‌లో మీడియాతో మాట్లాడుతూ.. ఎన్నికల ముందు ఇందిరమ్మ రాజ్యం తీసుకొస్తామని చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం.. ఇప్పుడు తెలంగాణలో ‘బుల్డోజర్ రాజ్యం’ నడుపుతోందని మండిపడ్డారు. మూసీ ప్రాజెక్టు పేరిట లక్షన్నర మంది పేదల ఇండ్లను కూల్చివేయడానికి కుట్ర జరుగుతోందని ఆరోపించారు. లక్షలాది మంది పేదల ఇండ్లను కూల్చి మూసీ అభివృద్ధి చేస్తామంటే బీఆర్‌‌ఎస్ పార్టీ చూస్తూ ఊరుకోదని, అవసరమైతే బుల్డోజర్లకు అడ్డుగా నిలబడ్తామని హెచ్చరించారు. 

మూసీ బ్యూటిఫికేషన్ కాదు.. లూటిఫికేషన్

మూసీ బ్యూటిఫికేషన్ పేరుతో జరుగుతున్నది లూటిఫికేషన్ అని కేటీఆర్ ఆరోపించారు. రూ.16 వేల కోట్లతో మూసీ నదిలో మురుగు నీటిని శుద్ధి చేయడం, కొండపోచమ్మ సాగర్ నుంచి మంచి నీటిని తీసుకురావడం, రెండు వైపులా స్కైవేలు నిర్మించడం కోసం డీటైల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ ఇప్పటికే సిద్ధంగా ఉందన్నారు. అయితే, ఆ ప్రాజెక్టును అమలు చేయకుండా రూ.లక్షన్నర కోట్ల ఖర్చుతో కొత్త ప్రాజెక్టు పేరిట అవినీతి చేసే ప్రయత్నం జరుగుతోందని ఆరోపించారు.

సీఎంతో పాటు ఆయన కుటుంబ సభ్యులు, కొంతమంది మంత్రులు చెరువుల ప్రాంతాల్లో ఇండ్లు కట్టుకున్నారని, అలాంటి వారిపై చర్యలు తీసుకోకుండా పేదల ఇండ్ల జోలికి మాత్రమే పోతోందన్నారు. మూసీ అభివృద్ధిపై మీకు చిత్తశుద్ధి ఉంటే మొదట సీఎం ఇంటి దగ్గర నుంచి కూల్చడం ప్రారంభించాలని డిమాండ్ చేశారు.