రాష్ట్రానికి కేంద్రం ఏం చేసిందో చెప్పాలి

రాష్ట్రానికి కేంద్రం ఏం చేసిందో చెప్పాలి

ఎల్బీ నగర్,వెలుగు : బీజేపీ స్టేట్ చీఫ్​ బండి సంజయ్ మోకాళ్ల యాత్ర చేసినా రాష్ట్ర ప్రజలు బీజేపీని నమ్మే పరిస్థితి లేదని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. సంజయ్ తన పాదయాత్రలో సీఎం కేసీఆర్ ను తిట్టుకుంటూ తిరగడం కాదని, ఎనిమిదేళ్ల  పాలనలో రాష్ట్రానికి కేంద్రం చేసిన మేలు ఏంటో ప్రజలకు ఆయన చెప్పాలని సబిత డిమాండ్ చేశారు. హైదరాబాద్ లోని సరూర్ నగర్ లో ఏర్పాటు చేసిన ఆసరా పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో ఆమె పాల్గొని మాట్లడారు.

రాష్ట్ర ప్రభుత్వం అమలుచేస్తున్న పథకాలు బీజేపీ పాలిత రాష్టాల్లో ఉన్నాయా అని ప్రశ్నించారు. మహేశ్వరం నియోజకవర్గంలో ఏర్పాటు కావాల్సిన ఐటీఐఆర్ ప్రాజెక్ట్ ను ఎందుకు రద్దు చేశారని నిలదీశారు. రాష్ట్రానికి నయా పైసా కూడా ఇవ్వని కేంద్ర ప్రభుత్వ వైఖరిపై యావత్ తెలంగాణ ప్రజలు గుర్రుగా ఉన్నారన్నారు. కేంద్రం ఒక్క ఉద్యోగం ఇవ్వకపోగా, సీఎం కేసీఆర్ 90 వేల ఉద్యోగాల భర్తీ ప్రక్రియ చేపట్టారన్నారు. ఎనిమిదేళ్లలో 1.30 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చామన్నారు.