స్కూళ్లలో టీచర్లే లేరు.. పిల్లలు చదువుడెట్ల?

స్కూళ్లలో టీచర్లే లేరు.. పిల్లలు చదువుడెట్ల?
  • రంగారెడ్డి జడ్పీ మీటింగ్​లో మంత్రి సబితను నిలదీసిన సభ్యులు
  • జిల్లాలో ఎక్కడి సమస్యలు అక్కడే ఉన్నయంటూ ఆగ్రహం

రంగారెడ్డి కలెక్టరేట్, వెలుగు: జిల్లాలోని ప్రభుత్వ స్కూళ్లలో టీచర్లు లేరని.. స్టూడెంట్లు ఎలా చదువుకుంటారని రంగారెడ్డి జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశంలో సభ్యులు మంత్రి సబితను నిలదీశారు. జిల్లాలో ఎక్కడి సమస్యలు అక్కడే ఉన్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు.  లక్డీకపూల్​లోని రంగారెడ్డి జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో జరిగిన సమావేశానికి జడ్పీ చైర్ పర్సన్​ తీగల అనితా రెడ్డి అధ్యక్షత వహించగా విద్యా శాఖ మంత్రి సబితా రెడ్డి చీఫ్​గెస్ట్​గా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎజెండాలోని పలు అంశాలపై సభ్యులు చర్చించారు. జిల్లాలోని మంచాల, తలకొండపల్లి, ఇతర మండలాల్లోని స్కూళ్లలో టీచర్ల కొరత తీవ్రంగా ఉందని, ఫలితాలు రావడం లేదని వాపోయారు. 

టీచర్లు లేకపోతే స్టూడెంట్లు ఎలా చదువుతారని డీఈవో సుశీందర్​రావును ప్రశ్నించారు. తలకొండపల్లి, యాచారం మండలాల్లోని ఆసుపత్రుల పెచ్చులు ఊడిపోతున్నాయని, కొన్ని ఆసుపత్రుల్లో సిబ్బంది కొరత ఉందన్నారు. వీటితోపాటు జిల్లాలోని పలు సమస్యలను సభ దృష్టికి తీసుకెళ్లారు. కాగా ఈ సమస్యలను ఆయా శాఖల అధికారులు వెంటనే పరిష్కరించాలని మంత్రి సబిత ఆదేశించారు. సమావేశంలో జిల్లా అడిషనల్ కలెక్టర్ ప్రతీక్ జైన్, జిల్లా ప్రజా పరిషత్ సీఈవో దిలీప్ కుమార్, ఎమ్మెల్యే జైపాల్​యాదవ్, కో-ఆప్షన్ సభ్యులు, జడ్పీటీసీలు, ఎంపీపీలు, జిల్లా అధికారులు పాల్గొన్నారు.